మానేరు రివర్ ఫ్రంట్’ పనులపై మంత్రి గంగుల ప్రత్యేక దృష్టి
హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష
డిసెంబర్ నుంచి పనుల ప్రారంభానికి చర్యలు
కార్పొరేషన్, నవంబర్ 6: మానేరు రివర్ ఫ్రంట్ పనులపై మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ముంపును తగ్గించి, సందర్శకులను ఆకట్టుకునేలా నిర్మించేందుకు అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లోని జలసౌధలో టూరిజం, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రాజెక్టు నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించారు. డిసెంబర్ నుంచి పనులను ప్రారంభించే దిశగా ముందుకు సాగుతున్నారు.
కరీంనగర్‌కు సరికొత్త అందాలను తీసుకువచ్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులపై రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. మానేరు నదికి వచ్చే వరద ప్రవాహాన్ని తట్టుకొని నిలిచేలా చెక్ డ్యాంలతోపాటు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సుందరీకరణ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌కు తుదిరూపు, రిటైనింగ్ వాల్ డిజైన్లు, భూసేకరణ తదితర అంశాలపై శనివారం హైదరాబాద్‌లోని జలసౌధలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ టూరిజం, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా 15 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించగా.. తొలి విడుతలో నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
అలాగే నదిలో వచ్చే ముంపు తగ్గించడంతోపాటు రివర్ ఫ్రంట్ అందాలు మరింత పెంచేలా హాప్ బరాజ్, హాప్ వీర్ ప్రాతిపదికన మొదటి విడుత నిర్మాణాలు చేపట్టాలని ఈ సమీక్షలో సూత్రప్రాయంగా ఆమోదించినట్లు వెల్లడించారు. కాగా, నదిలో గత వందేళ్ల నీటి విడుదల పరిమాణం ఆధారంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఎత్తు, వెడల్పు, లోతు విషయాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సమీక్షలో ముందుకు వచ్చిన అంశాలపై వచ్చే వారం రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా అన్ని అంశాలను ఈ డిసెంబర్‌లోగా పూర్తి చేసి ఆ వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు టెండర్ల పక్రియ చేపట్టే దిశగా ముందుకు సాగుస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో చిన్నారుల పార్కులు, వాటర్ ఫౌంటేన్స్, బోటింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం శాఖ ఈడీ శంకర్‌రెడ్డి, టీఎస్ టీడీసీ సీఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, ఐఎన్ఐ కన్సల్టెన్సీ డైరెక్టర్ హర్ష్ గోయల్, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.