ఈటల రాజేందర్ కాదు.. వెన్నుపోటు రాజేందర్
పెత్తందార్ల పార్టీ అన్నోనివి.. ఎట్ల చేరినవ్
హుజూరాబాద్ ఎన్నికల కోసమే బండి పాదయాత్ర
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
బీజేపీ ఫేక్ న్యూస్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టాలి
ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే బాల్క సుమన్
కిష్టంపేటలో సోషల్ మీడియా సదస్సుకు హాజరు
వీణవంక, జూలై 5: ‘బీజేపీ నేత ఈటల ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఈ రోజు ఢిల్లీలో నీ స్థానమెక్కడ.. కిరాయి పార్టీ దగ్గర ఆత్మగౌరవం ఉందా..? ఆత్మవిమర్శ చేసుకోవాలని’ ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. సొంత తమ్ముడోలే సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకొని.. అనేక పదవులు ఇస్తే వెన్నుపోటు పొడిచిన ఘనత ఈటలదని, ఆయన పేరు ఈటల రాజేందర్ కాదని వెన్నుపోటు రాజేందర్ అని మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కిష్టంపేట ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చి, మాట్లాడారు. బీజేపీ పెత్తందార్ల పార్టీ అని ఎన్నో సందర్భాల్లో అన్న నీవు.. ఈ రోజు అదే పార్టీలోకి వెళ్లి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పొడిచావని మండిపడ్డారు.
రిజర్వేషన్లను ఎత్తివేస్తున్న పార్టీ బీజేపీ అని, దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని, దళిత ప్రజలు గుర్తించాలని సూచించారు. బీజేపీ విభజించి పాలిస్తుందని, రోజురోజుకు పెరుగుతున్న ధరలను మహిళలు, యువకులు గమనిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఎందుకు ఇవ్వట్లేదో ఈటల చెప్పాలని, 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని చెప్పిన బీజేపీ ఎందుకు హామీలు నెరవేరుస్తలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అసత్య ప్రచారాలను అడ్డాగా చేసుకున్న బీజేపీ ఫేక్ న్యూస్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టి హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగిరేలా టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పని చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని అసత్య ప్రచారాలు చేసి దుబ్బాక ఎన్నికలలో బీజేపీ గెలిచిందని మండిపడ్డారు. అదే నాగార్జునసాగర్ ఎన్నికల్లో అసత్య ప్రచారాలను తిప్పికొట్టడం వల్ల వాళ్లకు డిపాజిట్ కూడా రాలేదని అన్నారు. సోషల్ మీడియాలో అనునిత్యం అప్రమత్తంగా ఉండడం వల్ల రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, గ్రామస్థాయి నుంచి తెలంగాణ ప్రగతి భవన్ దాకా సోషల్ మీడియా ద్వారా అనుసంధానం ఉంటుందని తెలిపారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామరక్ష లాగా సీఎం కేసీఆర్ సార్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని చెప్పారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయమని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని పేర్కొన్నారు. ఇగ ‘కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు బండి సంజయ్ పాదయాత్ర చేస్తాడట. కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లో నాలుగు ఓట్లు తెచ్చుకునేందుకే ఈ డ్రామాలాడుతున్నాడని’ దుయ్యబట్టారు.
గుణపాఠం చెప్పాలి: ఎమ్మెల్సీ నారదాసు
అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్న బీజేపీకి సోషల్ మీడియా వారియర్స్ తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, కో ఆప్షన్‌మెంబర్ హమీద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, 300 మంది సోషల్‌మీడియా వారియర్స్ ఉన్నారు.