కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);నడ్డా.. ఇది నీ కళ్లకు కనిపించడం లేదా? సాగునీటి రంగానికే ఒక కొత్త మార్గదర్శనం చేసి, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చిన కాళేశ్వరం పథకంలో అవినీతి జరిగిందంటావా? బీడు, నెర్రెలు బారిన నేలల్లో సాగు పండుగలా మారి, పుట్లకొద్ది వడ్లు పండేది కనిపించడం లేదా? నా కాళేశ్వరం నీళ్లతో బంగారు పంటలు పండుతుంటే.. ఆ పంటను కొనేదిలేదని ముఖం చాటేస్తున్నది మీ కేంద్రమే కదా? ధాన్యం కొనబోమని నా అన్నదాతలను నట్టేట ముంచేందుకు కుట్ర చేస్తున్నది మీరే కదా? ఒక్క మాట చెబుత. నీకు చిత్తశుద్ధి ఉంటే.. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు నిర్మాణం జరిగిన తీరును ఒక్కసారి పరిశీలించు! ఆ తర్వాత మాట్లాడు. నీ కండ్ల్లు చెమ్మగిళ్లకపోతే నన్ను అడుగు! నా నీరు వెళ్లే దారుల్లో, గ్రామాల్లో ఒక్కసారి రైతులను అడిగి చూడు! వారేమి చెప్తరో విను. అప్పుడు మాట్లాడు కాళేశ్వరం మీద! అంతెందుకు మీ కేంద్రం, లేదా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా కాళేశ్వరంలాంటి నిర్మాణాలున్నయా? దిగువకు వెళ్తున్న నదిని ఎగువకు మళ్లించిన దాఖలాలున్నయా? నడ్డా.. అందుకే చెబుతున్న ఒక్కసారి నా నదిని చూడు. కేసీఆర్ సంకల్పబలంతో నా జలధారలు పరుగులు పెడుతున్న కాలువలు, ప్రాజెక్టులు, చెరువులు, పొలాల పొంట గలగలా పారుతున్న నీళ్లను చూడు.
నడ్డా.. నేను గోదావరిని. కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నీవు ఒక్కసారి నన్ను చూడు. కాళేశ్వర ప్రాజెక్టు పుణ్యమా అని 110 కిలోమీటర్ల పొడవునా.. నన్ను సజీవ నదిగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. కాళేశ్వర ఎత్తిపోతల పథకం పేరిట నా దిశను మార్చింది, జాతికి అంకితం చేసి నాకంటూ ఓ గుర్తింపు తెచ్చింది ఆ అపరభగీరథుడే. కానీ, అంతకుముందు ఏటా నా నీరంతా సముద్రం పాలయ్యేది. కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా ఏనాడూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ నడిఒడ్డును చీల్చుకుంటూ వెళ్లి.. సముద్రంలో కలుస్తుంటే నాకే ప్రాణం కలుక్కుమనిపించేది. నా నీళ్లను ఎందుకు ఉపయోగించుకుంటలేరని బాధపడేదాన్ని. కానీ, ఇప్పుడు కాళేశ్వర పథకం పుణ్యమా.. తెలంగాణ మాగాణికి మళ్ల్లీ, నా జలధారలు పొలాలను ముద్దాడుతుంటే.. రైతన్న కండ్లల్లో కనపడే ఆనందం నాకు ఎంతో తృప్తినిస్తున్నది. నా నీళ్లతో పుట్లకొద్ది పంటలు పండితే నాకు పండుగలా అనిపిస్తున్నది. కాలువ నీళ్లే తెలియని ఎన్నో ప్రాంతాలకు నేను వెళ్తుంటే, వారంతా నాకు మంగళహారతులతో పలుకుతున్న స్వాగతం చూసి నా మది ఉప్పొంగుతున్నది. ఇన్నేళ్లుగా నేను కోరుకున్నది నా కండ్లముందే ఆవిష్కృతమవుతుంటే చూసి, ఇంతకన్నా మధురక్షణాలు ఏముంటాయనిపిస్తున్నది. నిజానికిది ఎప్పుడో జరగాలి! కేంద్రమే కాదు, సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల నా నీరంతా సముద్రం పాలైంది. పశ్చిమ కనుమల్లో పసికూనగా పుట్టి, నాసికాపురి వద్ద నడక నేర్చుకొని, 1465 కిలోమీటర్లు ప్రవహించి సాగరంలో కలుస్తోంటే నా గుండె తరుక్కుపోయేది. మధ్యలో తెలంగాణ గడ్డపైకి అడుగిడుతున్నప్పుడు నా మది పులకించేది. బాసర సరస్వతీని అర్చించి, ధర్మపురి నృసింహుడిని, గూడెం సత్తెన్నను, కాళేశ్వరుడిని దర్శించి.. భద్రాద్రి రాముడి పాదాలను తాకుతూ.. మొత్తం 653 కిలోమీటర్లు పారి కడలికి చేరుతుంటే, ఎవరికీ అక్కరకు రాకుండా పోతున్నాననే బాధ కలిగేది. గత చరిత్రలో ఏటా 1,709 టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయన్న ఆవేదన ఉండేది. సకల చరాచర జీవులకు జీవం పోసినా, పుష్కరస్నానాలు చేసే వారికి దీవెనలు ఇచ్చినా.. నాలో మాత్రం ఒక అసంతృప్తి ఉండేది.
తల్లి గోదారిగా ఖ్యాతి పొందిన నేను, చుక్కనీరు లేక బీళ్లుగా మారిన నా తెలంగాణ మాగాణులను చూస్తూ మనసులోనే మదనపడేదాన్ని. అవనికే అన్నం పెట్టే అన్నదాతల గోస తీర్చలేక బాధపడేదాన్ని. సాగు లేక.. అప్పులు కట్టలేక అసువులు బాస్తుంటే చూసి కన్నీరుపెట్టిన. చివరకు కర్మకాండలకు నా నీరే ఉపయోగిస్తుంటే కుమిలిపోయిన. ఇప్పుడు అపరభగీరథుడు కేసీఆర్ సంకల్ప బలంతో అన్నపూర్ణేశ్వరీగా మారిన. 2016 మే 2న మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసి, మూడేళ్లలోనే పూర్తి చేసి. కేసీఆర్ జాతికి అంకితం చేసిండ్రు. మేడిగడ్డ నుంచి దిశను మార్చుకొని, పంపుహౌస్‌ల నుంచి ఉవ్వెత్తున ఎగుస్తూ, సొరంగాలు, గ్రావిటీ కాలువల గుండా పారుతూ.. 253 కిలోమీటర్లు ఎదురెక్కి, 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మసాగర్‌ను ముద్దాడిన. వరదకాలువను జీవనదిలా మార్చిన. కాకతీయ కాలువల పొంట నెలల తరబడి పరుగులు పెట్టిన. నెర్రలు బారిన నేలల్లో సిరుల పంట పండించిన. నీలి విప్లవాన్ని సృష్టించిన. సబ్బండవర్గాలకు ఆనందాలు మోసుకొచ్చిన. ఇంతటి మహత్ కార్యక్రమానికి అంకురార్పణ చేసి, సాకారం చేసిన జలసారథి కేసీఆర్‌కు ప్రణమిల్లుతున్న.