సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం
మంత్రి గంగుల కమలాకర్
మీసేవ కార్యాలయంలో 190 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కార్పొరేషన్, జనవరి 2: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, రాష్ట్రంలోని ప్రతి గడపకూ అనేక పథకాల ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మంత్రి క్యాంపు మీసేవ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 190 మంది లబ్ధిదారులకు రూ.84.76 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఇందులో నగరానికి చెందిన 92 మంది లబ్ధిదారులకు రూ. 40.15 లక్షలు, కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన 23 మందికి రూ.10.69 లక్షలు, కొత్తపల్లి మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు రూ.11.50 లక్షలు, జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన 50 మందికి లబ్ధిదారులకు రూ.22.42 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అనారోగ్యం బారిన పడి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ఒక వరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, కార్పొరేటర్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.