సీఎం కేసీఆర్ పాలనలో గణనీయమైన అభివృద్ధి మంత్రి కొప్పుల ఈశ్వర్
బూరుగుపల్లిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
ధర్మపురి/ధర్మపురి రూరల్, ఫిబ్రవరి 1: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని చెప్పారు. మంగళవారం ధర్మపురి మండలం బూరుగుపల్లిలో దాదాపు రూ.50లక్షల నిధులతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామశివారులోని గుట్టబోరు లెవలింగ్ పనులను పరిశీలించారు. అలాగే జాతీయ రహదారి నుంచి తిమ్మాపూర్ ఎత్తిపోతల దాకా ఫార్మేషన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బ లోపేతానికి అనేక చర్యలు తీసుకుంటున్నారని, కు లవృత్తులకు జీవం పోశారని చెప్పారు. అనంతరం ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే రోలింగ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కాసేపు బ్యాటింగ్ చేశారు. మొదటగా కళాశాల స్థల దాత రాదాభాయమ్మ విగ్రహానికి పూల మాల వేసి, మాట్లాడారు. త్వరలోనే ధర్మపురి కళాశాల మైదానాన్ని రూ.50లక్షలు వెచ్చించి మినీ స్డేడియం గా మార్చనున్నట్లు తెలిపారు.
ధర్మపురిని టెంపుల్ సిటీగా మారుస్తాం..
నృసింహుడి క్షేత్రమైన ధర్మపురి పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయించామన్నారు. బడ్జెట్లో రూ.100కోట్లు కేటాయించారని, ప్రస్తుతం రూ.46 కోట్ల పనులు ప్రారంభ దశలో, కొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయని గుర్తు చేశారు. కేటాయించిన నిధులతో పనులన్నీ పూర్తయితే ధర్మపురి రూపురేఖలు మారునున్నాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 17మంది బైక్ మెకానిక్‌లకు ఈశ్రమ్ కార్డులను అందజేశారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ సత్తెమ్మ, వైస్ చైర్మన్ రామన్న ఉన్నారు.