కమాన్ చౌరస్తా, ఆగస్టు 31: కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగులు, యాజమాన్యం తనకు రెండు కండ్ల లాంటివారని, అందరి సహకారంతో బ్యాం కు ప్రజాదరణ చూరగొంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్, కేడీసీసీబీ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీసీసీబీఈఏ) కరీంనగర్ యూనిట్ ఆధ్వర్యంలో ఏఐబీఈఏ, టీసీసీబీఈఏ, ఏఐసీబీఈఎఫ్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు, సిబ్బంది సహకారంతోనే కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. ఒకప్పుడు జీతాల కోసం ఇబ్బంది పడే రోజులు పోయి బ్యాంకును రూ.51 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను 2005లో కేడీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నుంచి యాజమాన్యం, అసోసియేషన్ కలిసికట్టుగా ఉండడంతోనే బ్యాంక్ అభివృద్ధి బాటలో సాగుతుందని చెప్పారు. సహకార బ్యాంకులు ఇతర కమర్షియల్ బ్యాంకుల్లా కాకుండా ఉద్యమంలా వ్యక్తులు, సభ్యులు, ఖాతాదారులకు లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్నామని చెప్పారు. కరీంనగర్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ స్థాపించి 100 ఏండ్లు పూర్తి చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు.
శత వసంతాల పండుగను కరోనా కారణంగా జరుపుకోలేక పోయామని, నవంబర్‌లోగా వారంపాటు వేడుక నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. తాను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల అధ్యక్షుడిగా ఉన్నా అంతటి అవకాశం రావడానికి సహకరించిన కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగులు, పాలకవర్గం ప్రోత్సాహం ఎన్నటికీ మరువనని పేర్కొన్నారు. ఇక్కడి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుంటానని వివరించారు. అసోసియేషన్, యాజమాన్యం ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలన్నారు. టూ టైర్, ప్రత్యేక బోనస్ తదితర సమస్యలను ఐక్యంగా సాధించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.సురేందర్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి బ్యాంక్ అభివృద్ధిలో పాలుపంచుకున్నపుడే హకులను సాధించుకోవచ్చని తెలిపారు. బ్యాంక్ అధ్యకులు ఉద్యోగుల వేతన సవరణకు సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఈవో సత్యనారాయణరావు మాట్లాడుతూ.. ఇతర బ్యాంకులకు దీటుగా, పోటీతత్వంతో, ఆదర్శవంతంగా పనిచేసి వ్యాపార విస్తరణకు పనిచేయాలని కోరారు. సమావేశంలో కేడీసీసీబీ జీఎం బి.శ్రీధర్, టీసీసీబీఈఏ నాయకులు అంబటి మల్లేశం పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు..
కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా బ్యాంక్ ఉద్యోగులను గుర్తించిన మంత్రి కేటీఆర్‌కు కొండూరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలోనూ ఉద్యోగులు సేవలందించగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా అభినందించారని తెలిపారు. అంతకుముందు విధి నిర్వహణలో మరణించిన బ్యాంక్, సహకార సంఘ సిబ్బందికి సంతాపం తెలిపారు.
టీసీసీబీఈఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక..
తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సురేందర్, మల్లేశం ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా హన్మంతరావు, యూనిట్ సెక్రటరీగా పి.లావణ్య, ఉపాధ్యక్షుడిగా ఎండీ రహీమొద్దీన్, జాయింట్ సెక్రెటరీలుగా అమిత, శ్రీనివాస్‌గౌడ్, ట్రెజరర్‌గా టి.మనోజ్, ఈసీ సభ్యులుగా కుమారస్వామి, టి.రాజు, కె.ప్రవీణ్, ఎండీ శైనొద్దీన్, వెంకటేశ్, సాగర్‌రెడ్డి ఎన్నికయ్యారు.