జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్ 25:గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం విద్యార్థి లోకం మేము సైతం అంటూ ముందుకు నడుస్తున్నది. ఉద్యమ నేత, తోటి విద్యార్థి నాయకుడిని హుజూరాబాద్ నుంచి చట్టసభకు పంపేందుకు తెగ ఆరాటపడుతున్నది. హైదరాబాద్ వేదికగా నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో లాఠీదెబ్బలకు భయపడక, కేసులు వెరవకుండా చురుగ్గా పాల్గొన్న శ్రీనివాస్‌కు మద్దతిచ్చేందుకు విద్యార్థి సంఘాలు దండులా కదిలివస్తున్నాయి. ఊరూరా తిరుగుతూ ప్రచారాన్ని హోరెతిస్తూనే ఒక యూనివర్సిటీ విద్యార్థి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గానికి ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు క్లుప్తంగా వివరిస్తున్నారు.
విద్యార్థి నాయకుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు యూనివర్సిటీలు, విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన గెల్లు శ్రీనివాస్.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా అనేక ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థి నేతగా ఎదిగాడు. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో భాగంగా కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నా, కేసులు పెట్టినా భయపడలేదు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ)లో చురుకైన పాత్రను పోషించి ఉద్యమంలో విద్యార్థులు మమేకమయ్యేలా చూశారు. ఇలా విద్యార్థి నాయకుడిగా మంచి పేరు సంపాదించాడు.
సహచరుడి గెలుపు కోసం కదిలిన సోపతులు..
ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక రావడంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశమివ్వడంతో అతడిని గెలిపించుకునేందుకు సహచరులు కదిలివచ్చారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, విద్యార్థి సంఘాలు హుజూరాబాద్‌కు చేరి జోరుగా ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛందంగా గ్రామగ్రామానికి వెళ్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ గెలువాల్సిన ఆవశ్యకతను, అవసరాన్ని వివరిస్తూ ముందుకుసాగుతున్నారు. యూనివర్సిటీలో ఉండే పరస్పర విరుద్ధమైన భావాలతో నడిచే సంఘాల నాయకులు కూడా.. తమ వైరుధ్యాలను పక్కన బెట్టి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ విద్యార్థి లోకమంతా గెల్లు వైపు ఉందంటూ ముందుకుసాగుతున్నారు. చదువుకున్న వ్యక్తులు చట్టసభల్లో ఉంటే ఎలాంటి లాభాలు జరుగుతాయో, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు.
గెల్లుది మొండి పట్టుదల
ఉద్యమం మొదలైనప్పటి నుంచి గెల్లు శ్రీనివాస్ మాకు తెలుసు. ఆయన మంచి పట్టుదల ఉన్న వ్యక్తి. ఏ పని అప్పజెప్పిన పూర్తిచేసే దాక నిద్ర కూడ పోడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించిన కూడ పనులు పట్టుబట్టి చేస్తడు. ముఖ్యమంత్రి కుటుంబంతోటి తనకు ఉన్న సాన్నిహిత్యంతో అభివృద్ధి పనులు అనేకం చేయగలడు.
విద్యార్థుల సమస్యలపై మాట్లాడుతాడు
ఒక విద్యార్థి నాయకుడు ఎమ్మెల్యే శాసనసభలో అడుగుపెడ్తే విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతాడు. అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థుల సమస్యలు మరో విద్యార్థికి మాత్రమే తెలుస్తాయి. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలంటూ అన్ని గ్రామాలు తిరిగి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నం.
చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితె మంచిది
నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాగా చదువు ఉన్న వ్యక్తి అయినట్లయితే ప్రజలకు మేలు జరుగుతుంది. అధికారులతోటి మాట్లాడి పనులు సక్రమంగ జరిగేలా చూడగలుగుతాడు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి 30న జరిగే పోలింగ్‌లో కారు గుర్తుకు ఓటు వేయాలి. విద్యార్థులంతా తమ కుటుంబ సభ్యులకు చెప్పాలి.