సిరిసిల్ల టౌన్/ కోనరావుపేట, సెప్టెంబర్ 7: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అమాత్యుడు కేటీఆర్ ఆదేశాలతో జిల్లా పోలీసులు, రెవెన్యూ సహా అగ్నిమాపక యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్ అనురాగా జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే సూచనలతో ఎక్కడికక్కడ వరద బాధితులు, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించడంతోపాటు మేమున్నామనే భరోసా ఇచ్చింది. వేములవాడ పట్టణంలో నీటిలో చిక్కుకున్న 12 మందిని రక్షించిం ది. అలాగే జిల్లా వ్యాప్తంగా మరో 46 మందికిపైగా కాపాడింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పీఎస్ శ్రీనివాస్, ఓఎస్డీ మహేందర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు కలిసి శాంతినగర్, వెంకంపేటలో క్షేత్రస్థాయిలో సందర్శించారు. కరకట్ట వద్ద వరద నీటిని మానేరు వాగులతో తరలింపును పరిశీలించారు. ఇక జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో పూర్తిగా వరద నీరు చేరుకుంది. రూరల్ సీఐ ఉపేందర్, ఎస్సై సుధాకర్ బృందం సభ్యులు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతమైన శాంతినగర్ పూర్తిగా జలమయమైంది. దీంతో ప్రజలు ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందిపడ్డారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక, పోలీస్, వరద సహాయక బృందం సభ్యులు వెంటనే బోట్ సాయంతో ప్రజల వద్దకు చేరుకున్నారు. ఇండ్లలోకి నీరు చేరిన బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోనరావుపేట మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ ముందు ఉన్న ఒర్రెలో మహారాష్ట్రకు చెందిన ఆనంద్, విలన్ కొట్టుకుపోతుండగా, రైటర్ వెంకటేశ్‌గౌడ్, కానిస్టేబుళ్లు నాగరాజు, దేవేందర్ వెంటనే తాళ్ల సాయంతో వారిని రక్షించారు. కానిస్టేబుళ్లను చందుర్తి సీఐ శ్రీలత, ఎస్ఐ రాజశేఖర్ అభినందించారు.
అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ రాహుల్ హెగ్డే
రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడం, మానేరు ఉధృతంగా ప్రవహిస్తుండడతో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు. జిల్లా పోలీస్ అధికారులతో లోతట్టు ప్రాంతాలను మరియు శాంతినగర్, వెంకంపేట్ రోడ్, బీవై నగర్, సుందరయ్యనగర్ పాత బస్టాండ్ ప్రాంతాలను పరిశీలించి, మాట్లాడారు. ఏమైనా ఘటనలు జరిగితే సంబంధిత పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని, తక్షణ సాయం చేస్తామని చెప్పారు. వరద ఉధృతి ఎకువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు. ఎగువమానేరు జలాశయ నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండి మత్తడి దుంకుతుందని, జలాశయం వద్దకు ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయన వెంట డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు, ఎస్ఐలు, పోలీ స్ సిబ్బంది తదితరులు ఉన్నారు.