జమ్మికుంట, అక్టోబర్ 12: ‘స్వరాష్ట్రంలో అన్నివర్గాలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నరు. ప్రజలు సంతోషంగా ఉండడాన్ని బీజేపీ ఓర్వలేక పోతున్నది. ఆ పార్టీకి ఓటేస్తే నష్టపోతాం’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల చట్టాలు తెచ్చి మనల్ని ఆగమాగం చేస్తున్న.. ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. మంగళవారం 8వ వార్డులోని మారుతీనగర్‌లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి గెల్లు సీనుకు ఓటేయాలని అభ్యర్థించారు. తర్వాత కాలనీలోని ప్రజలతో ఇష్టాగోష్ఠి చేశారు. ఈటల పార్టీలో చేరినప్పుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కొత్తవాడేనని, తర్వాత ఆయనకు సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాలవల్ల ఎదిగిపోయాడని చెప్పారు. పదవులన్నీ అనుభవించి నమ్మక ద్రోహం చేసి పార్టీ నుంచి వెళ్లిపోయాడన్నారు. ఎందుకు రాజీనామా చేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు. సంస్కారం కోల్పోయి మాట్లాడుతున్నాడని, సీఎంకు గోరీ కడుతానని అనడం ఆయనకు మంచిదికాదన్నారు. మంత్రిగా పనిచేసిన ఆయన ఒక్క డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించలేక పోయాడని ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పుడే ఏం చేయని ఈటల, రేపు ఏం అభివృద్ధిని చేయగలడో ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఈటల రాజీనామా తర్వాత జమ్మికుంట సీఎం రూ.50కోట్లిచ్చారని, అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఇంకా రూ.50కోైట్లెనా ఖర్చు చేసేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీ ముందుకు వచ్చాడని, గరీబు బిడ్డకు ఓటేయాలని కోరారు. కాగా, ఏండ్లకాలంగా ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మించుకుని ఉంటున్నామని, పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను అందించిన టీఆర్ఎస్ సర్కారుకే అండగా ఉంటామని కాలనీ ప్రజలు హామీ ఇచ్చారు. కారు గుర్తుకే ఓటేస్తామని ప్రతినబూనారు. ఇక్కడ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పీఏసీఎస్ చైర్మన్ సంపత్, పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, శ్రీలత, టీఆర్ఎస్ నాయకుడు కశ్యప్‌రెడ్డి ఉన్నారు.