ఓదెల, ఆగస్టు 24: సర్కారు బడులు పూర్వ వైభవం దిశగా పయనిస్తున్నాయి. కరోనా కారణంగా జీవన పరిస్థితులు మారిపోయాయి. కరోనా కంటే ముందు ప్రైవేట్ బడులపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీంతో సర్కారు బడులు నిర్వీర్యమవుతూ వచ్చాయి. ఏడాదిన్నర నుంచి కరోనా కారణంగా బడులు నడవకున్నా ప్రైవేట్ వారు ఆన్లైన్ బోధన పేరిట ఫీజులు గుంజుతున్నారు. ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు బడుల బాట పడుతున్నారు. ఇదే అదనుగా సర్కారు బడి ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి చర్యలు చేపట్టారు. ఇందుకు ఓదెల మండలం చక్కని ఉదాహరణగా నిలుస్తున్నది. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 100 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. కొలనూర్ పీఎస్‌లో 27 మంది, ఉప్పరపల్లి పీఎస్‌లో 14, కొలనూర్ హైస్కూల్లో 11, పొత్కపల్లి హైస్కూల్లో 14, ఇందుర్తి పీఎస్‌లో 14, గూడెం పీఎస్‌లో 12 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. కరోనా కంటే ముందు కొలనూర్ పీఎస్‌లో 49మంది ఉంటే ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 121కి చేరింది. ఇక్కడి ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ కొత్త అడ్మిషన్లు చేయిస్తున్నారు. సర్కారు బడి, ప్రైవేట్ బడులకు మధ్యన తేడాలను వివరిస్తూ అడ్మిషన్లు సేకరిస్తున్నారు.
వీరికి పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు తోడ్పాటునందిస్తున్నారు. పూర్వ విద్యార్థులు రూ.1.70లక్షలతో పాఠశాలను ఆధునీకరించారు. ఇక్కడ పని చేసే ఉపాధ్యాయులు కూడా తమ జీతంలోంచి రూ.20వేలు పాఠశాల అభివృద్ధికి ఇవ్వడం గమన్హారం. అలాగే ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు ట్రంపోలిన్ ఆట వస్తువులు, 20 డ్యూయల్ డెస్క్ బెంచీలు, విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్‌తో పాటు చదువుకు అవసరమైన వస్తు, సామగ్రిని వితరణ చేసి ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయులు కూడా కరోనా కాలంలో ప్రైవేట్ బడులను తలపించేలా ఆన్లైన్ తరగతులు, జూమ్ యాప్ ద్వారా బోధించారు. విద్యార్థుల ఇండ్లకు వెళ్లి పర్యవేక్షణ చేయడం తల్లిదండ్రులను ఆకర్షించింది. ప్రైవేట్ వద్దు.. సర్కారు బడే ముద్దు అంటూ కొత్తగా అడ్మిషన్లు పెరగడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. కరోనా కారణంగా ప్రైవేట్, సర్కారు బడుల ప్రాధాన్యత ప్రజలకు తెలిసి వచ్చిందని పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి ఉపాధ్యాయులు కూడా తమ విధులను అంకితభావంతో నిర్వర్తిస్తుండడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
సర్కారు బడులవైపే తల్లిదండ్రుల చూపు
పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు సర్కారు బడుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలలకు అదరణ పెరిగింది. మా పాఠశాలలో కరోనా కంటే ముందు 49 మంది విద్యార్థులే ఉండేవారు. ప్రస్తుతం 121 మందికి పెరిగారు. మేము ఇంటింటికీ తిరిగి సర్కారు బడి ప్రాధాన్యతను తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. వారు సానుకూలంగా స్పందిస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కొలనూర్ బడిలో చదివిన పూర్వ విద్యార్థుల తోడ్పాటు అభినందనీయం. పాఠశాలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించి, మాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అందుకే మా పాఠశాలకు పూర్వ వైభవం సంతరించుకుంటున్నది. తల్లిదండ్రులు, గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి బోధనను అందిస్తాం. – తోట రాజు, పీఎస్ ఉపాధ్యాయుడు, కొలనూర్