ఇన్నాళ్లు గుడిసెల్లో, కిరాయి ఇండ్లల్లో అష్టకష్టాలు పడ్డ నిరుపేదల కల నెరవేరింది. మంత్రి కేటీఆర్ చొరవతో ఓ గూడు దొరికింది. సొంతింటి పట్టా చేతికొచ్చింది. ఇంటికి పండుగతెచ్చింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 1700 మంది లబ్ధిదారులను ఎంపికచేయగా, మొదటి విడుతలో 400 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చేతుల మీదుగా సొంతింటి పట్టా అందుకున్న లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలారు. తమ సొంతింటి కల నిజం చేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ జీవితాంతం రుణపడి ఉంటామని భావోద్వేగానికి లోనయ్యారు. – సిరిసిల్ల టౌన్, ఆగస్టు 1
ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. మంత్రి కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల పరిధిలోని మండేపల్లిలో 2వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. మున్సిపల్ పరిధిలోని 39 వార్డులకు చెందిన లబ్ధిదారుల్లో కంప్యూటర్ రాండమైజేషన్ విధానంలో ఎంపిక చేసిన 400మందికి సోమవారం సినారె కళామందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఇండ్ల పట్టాలను అందజేశారు. పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నమెంట్ స్కూల్లో తలదాచుకున్న
ఇల్లు లేక నేను గవర్నమెంట్ స్కూల్లోని చిన్న ఇరుకు గదిలో నా తల్లితో పాటు తలదాచుకున్నాను. నా దీనస్థితి తెలిసిన మంత్రి కేటీఆర్ సార్ వెంటనే డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేశారు. ఈ రోజు పట్టా అందుకున్న. ఇవ్వాల్టి నుంచి నేను నా ఇంట్లో ఉంటా. మస్తు సంబురమైతంది. కేటీఆర్ సార్ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను. – ఉమాపతి, లబ్ధిదారుడు (26వ వార్డు )
దశల వారీగా పట్టాల పంపిణీ..
పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో అన్ని మౌలిక వసతులు కల్పించాం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 1700 మంది లబ్ధ్దిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేసినం. కంప్యూటర్ రాండమైజేషన్ విధానంలో 400 మంది వృద్దులు, వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటి నంబర్లను కేటాయించాం. మొదటి విడుతలో వీరికి పట్టాలు పంపిణీ చేసినం. దశల వారీగా లబ్ధిదారులందరికీ ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తాం. ఎవరూ ఆందోళన చెందవద్దు.
– వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్
మంత్రి కేటీఆర్ చొరవతో..
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తున్నాం. సకల వసతులతో ఇండ్లను నిర్మించాం. వార్డు సభల ద్వారా డ్రా పద్ధతిలో ఎంపికైన లబ్ధిదారులకు దశాల వారీగా పట్టాలు పంపిణీ చేస్తున్నాం. 400 మందికి ఇండ్ల పట్టాలు అందజేయడం చాల సంతోషంగా ఉంది. అర్హులై ఉండి డబుల్ బెడ్ రూం ఇల్లు రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్
మున్సిపల్ పరిధిలోని 39వార్డులలో గతంలో నిర్వహించిన వార్డు సభలలో డ్రా పద్ధతిలో వార్డుల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపిక చేసిన 1700 మందిలో కంప్యూటర్ రాండమైజేషన్ విధానంలో దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేపట్టారు. ఇందులోభాగంగా మొదటి విడుతలో 60సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులను కలుపుకొని మొత్తం 400 మందికి గ్రౌండ్ ఫ్లోర్లో కేటాయించిన ఇంటి నంబర్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కమిషనర్ వెల్దండి సమ్మయ్య, తహసీల్దార్ విజయ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.