హుజూరాబాద్/హుజూరాబాద్ చౌరస్తా, ఆగస్టు 17: సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి తీసుకువచ్చిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని అచ్చంపేట ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు ఉద్ఘాటించారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్‌హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సింగాపురంలో ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్‌తో కలిసి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఆయాచోట్ల బాలరాజు మాట్లాడారు. దళితులను పేదరికం నుంచి బయటపడేయాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ దళితబంధుకు శ్రీకారం చుట్టారని, పథకం ప్రారంభంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని దుయ్యబట్టారు. అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. కనికరం లేని కాషాయ పార్టీలోకి ఎందుకు వెళ్లారో.. అందరికీ తెలుసని ఈటలనుద్దేశించి పరోక్షంగా విమర్శించారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఆశయాన్ని పక్కన పెట్టి బీజేపీలోకి చేరారని ఆరోపించారు. దళితులు, అణగారిన వర్గాల భూములను ఆక్రమించుకొని కోట్లకు పడగలెత్తి అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన చేసిన పాపాలు పోవాలంటే దళితుల గ్రామాలను దత్తత తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని హితవు పలికారు. దళితబంధు పథకం వంద శాతం విజయం సాధించేందుకు అన్ని వర్గాల ప్రజల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు తథ్యమని చెప్పారు.
మన పథకాలు దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే సతీశ్‌బాబు
మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు కోసం కార్యకర్తలంతా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతున్నదని, టీఆర్ఎస్కే ప్రజలు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తంజేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో దేశం మొత్తం కేసీఆర్ వైపే చూస్తున్నదని వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ మారెపెల్లి సుధీర్‌కుమార్ పేర్కొన్నారు. సామాన్య వ్యక్తిగా వస్తున్న గెల్లు శ్రీనివాస్‌యాదవ్ బీజేపీ నేత ఈటలను చిత్తుగా ఓడించబోతున్నాడని ధీమా వ్యక్తంజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రతి పథకంతో పేదోళ్ల బతుకులు మారుతున్నాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. దళితబంధు సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధికారి దొంత రమేశ్, కౌన్సిలర్లు కల్లెపెల్లి రమాదేవి, యాదగిరినాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోమారపు రాజయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, సైదాపూర్ సర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి కాయిత రాములు, నాయకులు మొలుగూరి ప్రభాకర్, గందె సాయి, రియాజ్, రవీందర్‌రెడ్డి, కనుకుంట్ల విజయ్‌కుమార్, రాజిరెడ్డి ఉన్నారు.