జమ్మికుంట, ఆగస్టు 30: దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని, రాష్ట్రంలో ఉన్న దళితులందరి ఆర్థికాభివృద్ధ్ధికి ఈ పథకం దోహదపడుతుందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జమ్మికుంటలోని 21వ వార్డులో పర్యటించారు. అధికారులు చేస్తున్న దళితబంధు సర్వేను పరిశీలించారు. తర్వాత వార్డులోని దళిత కుటుంబాలతో సమీక్షించారు. పథకం వివరాలడిగి తెలుసుకున్నారు. సర్వే తీరుతెన్నులను ప్రశ్నించారు. దళితబంధుతో ఉపయోగాలు, ఏ యూనిట్‌ను పెట్టుకుంటారు? అని అడిగారు. తర్వాత ఆయన మాట్లాడారు. అట్టడుగు జీవితాలు దళితులవని, స్థితిగతులు బాగుపడాలని సీఎం కేసీఆర్ పథకాన్ని తెచ్చారని చెప్పారు. రూ.10లక్షలను సద్వినియోగం చేసుకుని గొప్పగా బతకాలని సూచించారు. పథకాన్ని రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా అమలు చేసేందుకు సీఎం దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. ఇందుకు రూ.లక్షా 70వేల కోట్లను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల దళితులు ఆయా ప్రభుత్వాలను దళితబంధు ఇవ్వాలని అడుగుతున్నారని, దేశానికి ఈ పథకం దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. ఇంతగా ఆలోచించిన ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఆయన వెంట కమిషనర్ సుమన్‌రావు, తహసీల్దార్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, స్థానిక కాలనీవాసులున్నారు.
నైపుణ్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి
ఎవరి నైపుణ్యాలను అనుగుణంగా వారు దళితబంధు యూనిట్‌ను ఎంపిక చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని రెడ్డిపల్లిలో సోమవారం చేపట్టిన దళితబంధు సర్వేను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. దళిత కుటుంబాలతో నేలపై కూర్చొని మాట్లాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల తలరాతలు మారలేదని, దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు. కేసీఆర్ ఆకాంక్ష నెరవేరాలంటే ప్రతి దళిత కుటుంబం సరైన యూనిట్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు వస్తుందని, తప్పుదోవ పట్టించేవారి మాటలు నమ్మవద్దన్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను సర్పంచ్ పోతుల నర్సయ్య దంపతులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, డీఆర్డీవో శ్రీలతరెడ్డి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ-భూమయ్య, నాయకులు సత్యనారాయణ, పోతుల సురేష్, శ్రీనివాస్, చింతల సుమన్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.