జమ్మికుంట, ఆగస్టు 30 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించిన పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, గెల్లు సీను గెలుపు సీను అని, ఆయన పేరులోనే గెలుపున్నదని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభివర్ణించారు. ఇక్కడి యువత కోసం అవసరమైతే ఉన్నత విద్య కళాశాలలను ఏర్పాటు చేయించే సత్తా గెల్లుకు ఉన్నదని, మరి ఈటలకు ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘దున్నపోతుకు గడ్డేసి పాలు పిండితే వస్తాయా..?’ అందుకే పనిచేసే గెల్లుకే ఓటేసి గెలిపించుకోవాలని, ఉరిమే ఉత్సాహంతో యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ గడ్డ టీఆర్ఎస్ అడ్డా అని, టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీఆర్ గార్డెన్స్‌లో సోమవారం చేరికల కార్యక్రమం నిర్వహించారు. వెయ్యి మంది అనుచరులతో కలిసి బీజేపీ యువ నాయకుడు చిన్నాల శ్రీకాంత్ టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. 60వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతున్నదని, కొద్ది రోజులు కష్టపడుదామని, మీ వెంట నేనుంటానని, టీఆర్ఎస్ను గెలిపించుకుందామంటూ యువతకు దిశానిర్దేశం చేశారు.
తన ప్రసంగంతో ఉత్సాహం నింపారు. బీజేపీ హుజూరాబాద్ ఓట్ల కోసం వస్తున్నదని, అసలు ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఆలోచించుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రలోభ పెడుతున్నదని, భయపెడుతున్నదని బీజేపీ నేత ఈటల అబద్ధపు ప్రచారం మొదలు పెట్టాడని విమర్శించారు. ప్రజలను భయపెడితే ఇంత మంది యువకులు ఇక్కడకు రాగలరా..? అని అడిగారు. ఈటల బీజేపీ అనే పాడుబడ్డ బాయిబొందల పడ్డాడని, అందులోంచి రావడానికి గడియారాలు, గ్రైండర్లు, కుక్కర్లు, కుట్టు మిషన్లు, కుంకుమ భరిణెలు, మేకపోతులు, కోళ్లు, ఫుల్ బాటిల్స్ పంచుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇదేనా ఆత్మగౌరవం అని, ఒకప్పుడు మద్యం, పైసలు పంచాల్సి వస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని చెప్పాడని, ఇప్పుడేం చేస్తున్నడో చెప్పాలే అని ప్రశ్నించారు. తనకు 200ఎకరాలున్నాయని, ఒక ఎకరం అమ్మితే ఒక ఎన్నిక గెలుస్తానని అంటున్నాడని, ఇది ఆయనకున్న అహంకారాన్ని బయటపెడుతున్నదని చెప్పారు. అసలు ఇక్కడ బీజేపీకి బలమే లేదని, 2018ల అసెంబ్లీ ఆ పార్టీకి వచ్చిన ఓట్లెన్నో గుర్తుకు చేసుకోవాలని, వాళ్లకు నాయకులెక్కడున్నరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరక ముందే ఇక్కడ మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిచిన సందర్భాన్ని గుర్తు చేశారు.
దేశానికి పట్టిన చీడపీడ బీజేపీ..
బీజేపీ దేశానికి పట్టిన చీడపీడ. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. ‘వార్ టైం లీడర్’ హరీశ్‌రావు మన వెంట ఉన్నారు. ఆయన సారథ్యంలో గెల్లు గెలుపు నల్లేరు మీద నడకే. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దారు. కాళేశ్వరంతో భూములు పచ్చగా కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలో లక్షా 33వేల ఉద్యోగ నియామకాలు చేశారు. మరో 60వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి. కేటీఆర్ కృషితో వేలాది కంపెనీలు వచ్చాయి. 17లక్షల మంది యువతీయువకులకు ఉద్యోగాలు వచ్చాయి. బీజేపీ అబద్ధాలు చెబుతూ ఊళ్లలోకి వస్తున్నది. రేవంత్, సంజయ్ స్వప్రయోజనాల కోసం పాదయాత్రలు చేస్తున్నారు. యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి. టీఆర్ఎస్ అభివృద్ధి వైపా..? బీజేపీ విచ్ఛిన్నం వైపా..? ప్రజలు ఆలోచించుకోవాలి. గెల్లుకు సీఎం కేసీఆర్ ఆశీస్సులున్నాయి. చిన్నోడే అయినా.. రేపు గెలిచిన తర్వాత ఆకాశమంతా ఎత్తులో ఉంటాడు. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు.
ఈటలను ఓడిస్తేనే బాగుపడ్తది..
ఈటల మంత్రిగా ఉండి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఆయనను ఓడిస్తేనే నియోజకవర్గం బాగుపడుతది. ఈటల ఎవ్వలను అడిగి రాజీనామా చేసిండో చెప్పాలి. టీఆర్ఎస్లో పదవులన్నీ అనుభవించి, ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరిండు. గెల్లు గెలిస్తేనే లాభం. నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
బీజేపీ, ఈటలపై ముసలి పులి కథ..
ఈటల పరిస్థితి ఎట్లుందంటే ఎన్కటి పులి కథ గుర్తొస్తున్నది. చిన్నప్పుడు తెలుగు వాచకంలో ముసలి పులి కథ చదువుకున్నం. అందులో ఏముందంటే.. ఒక పులి నడుస్తూ నడుస్తూ.. బాయిల పడ్డది. బయటెలా పడాల్నో తెల్తలేదు. ఆకలైతంది. దారిన పోయెటోళ్లను ఒక్కొక్కలను పిలవడం మొదలు పెట్టింది. నన్ను బాయిల నుంచి తీయిన్రి. నా దగ్గర బంగారు కడియం ఇస్త అని ఆశ చూపింది. బంగారు కడియానికి ఆశ పడి ఆ పులి దగ్గరి పోయినోళ్లను ఒక్కొక్కరిని చంపుకొని తినడం మొదలుబెట్టింది. ఇయ్యాల ఈటల రాజేందర్ కూడా బీజేపీ అనే పాడుబడ్డ బొందల పడ్డడు. ఆ పాడుబడ్డ బొందల కెళ్లి రావడానికి గడియారాలు, గ్రైండర్లు, కుట్టు మిషన్లు, కుంకుమ భరిణెలు, సెల్ ఫోన్లు, కోళ్లు, మందు బాటిళ్లు, మేకపోతులు.. ఇలా ఎన్నో ఆశ పెడ్తున్నడు. ఇదేనా ఆత్మగౌరవమంటే.. వీటన్నింటిలో ఆత్మగౌరవముందా..? హుజూరాబాద్ బిడ్డలను కొందామనుకుంటవా..? ఆశ పడి వెళ్లకండి మిత్రులారా.. మనల్ని చంపుకతింటరు’ అని బీజేపీ పార్టీ, ఈటల రాజేందర్ నైజాన్ని బయట పెట్టిండు.