కార్పొరేషన్, అక్టోబర్ 25: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెకింపు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కౌంటింగ్ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓట్లు లెకించాలని సిబ్బందికి సూచించారు. వీవీ ప్యాట్లోని స్లిప్పులను కూడా లెకించాల్సి ఉంటుందని, బ్యాలెట్ బాక్స్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల లెక సరిగ్గా ఉండాలన్నారు. ఫాం 17-సీని చెక్ చేయాలని పేర్కొన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తుకృష్ణన్ శంకర్‌నారాయణ, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్‌తో కలిసి పరిశీలించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను పరిశీలించి, వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెకింపులో కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమన్నారు. కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, సిబ్బంది, కౌంటింగ్ అసిస్టెంట్లను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఆర్డీవో ఆనంద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి
ఈనెల 30న జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియను మైక్రో అబ్జర్వర్లు (సూక్ష్మ పరిశీలకులు) నిశితంగా పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తుకృష్ణన్ శంకర్‌నారాయణ ఆదేశించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో ఉప ఎన్నికల మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలిస్తూ, పోలింగ్ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు. ఉదయం ఆరు గంటల వరకే మాక్ పోలింగ్ నిర్వహించేలా చూడాలన్నారు. మాక్ పోలింగ్ తర్వాత వీవీ ప్యాట్లలోని స్లిప్పులు తొలగించి సీల్ చేసేలా గమనించాలన్నారు. పోలింగ్ సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు కంట్రోల్ యూనిట్ బటన్ క్లోజ్ చేసిన విషయాన్ని ధ్రువీకరించుకోవాలన్నారు. ఈనెల 29న సాయంత్రం నాలుగు గంటలకు హుజూరాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మైక్రో అబ్జర్వర్లు రిపోర్టు చేయాలని, పోలింగ్ ముగిశాక సిబ్బందితో కలిసి ఈవీఎంలను కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల రిసెప్షన్ సెంటర్లో అప్పగించాలని ఆదేశించారు. మైక్రో అబ్జర్వర్ల నోడల్ అధికారి రాంబాబు, శిక్షణ తరగతుల ఇన్చార్జి అధికారి రవీందర్, ఆర్డీవో ఆనంద్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.