వీర్నపల్లి, ఫిబ్రవరి 10 : అన్నల అలజడులు..పోలీసు బూట్ల చప్పుల మధ్య నలిగిన పల్లెలో ‘ప్రగతి’ మల్లెలు విరబూస్తున్నాయి. తుపాకుల మోతతో నెత్తురొడిన చోట అభివృద్ధి కాంతులు వెదజల్లుతున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద మాజీ ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లి ఐదేండ్లలో తన రూపురేఖలు మార్చుకొని భారతదేశ చిత్రపటంలో చోటు దక్కించుకున్నది. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు 2016లో వీర్నపల్లిని దత్తత తీసుకోగా, ఎనిమిది తండాలతో 3698 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడంతో పాటు తన కోటా నుంచి నిధులను ఖర్చు చేసి వినోద్‌కుమార్ సకల సౌకర్యాలు కల్పించారు. మొదట అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను గుర్తించారు. నిర్దేశిత సమయంలోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
కలిసొచ్చిన పల్లె ప్రగతి..
తెలంగాణ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన పల్లె ప్రగతితో వీర్నపల్లి మరింత అభివృద్ధి చెందింది. ఇందులో భాగంగా డంప్‌యార్డు, శ్మశానవాటికను నిర్మించారు. భూగర్భ జలాల పెంపునకు నీటినిల్వ కుంటలు, ఇంకుడు గుంతలు నిర్మించారు. ఫర్క్యులేషన్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలతో ఈ పల్లె పచ్చని కళ సంతరించుకున్నది. ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ రావడంతో ఈ పల్లె దశ తిరిగింది. లూజ్‌వైర్లను సరిచేశారు. వంగిన స్తంభాల స్థానంలో కొత్త పోళ్లను అమర్చారు.
పూర్తి చేసిన పనులు.. రూ. 8కోట్లతో రింగ్‌రోడ్డు నిర్మాణం
రూ.2.40 కోట్లతో కేజీబీవీ పాఠశాల, రూ.49 లక్షలతో ఉన్నత పాఠశాల భవనం, ప్రైమరీ స్కూల్లో అదనపు తరగతుల నిర్మాణం
సెల్ టవర్(3జీ సేవలు), పాలకేంద్రం, పెట్రోల్ బంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు
రూ.2.40కోట్లతో భూక్యాతండా, బావుసింగ్తండాలో రెండు వంతెనలు, ఏడు అంగన్వాడీ భవనాలు, సాముహీక భవనం, ఇంకుడుగుంతల నిర్మాణం, వందశాతం మరుగుదొడ్లు, అంతర్గత రోడ్లు, రూ.13లక్షలతో గ్రామ పంచాయతీ భవనం
రూ.25కోట్లతో ఎల్లారెడ్డిపేట నుంచి వీర్నపల్లి మీదుగా మరిమడ్ల వరకు డబుల్ రోడ్డు
మిషన్ కాకతీయ కింద రూ.80 లక్షలతో వెంకట్రాయినీ చెరువు పునరుద్ధరణ.
గ్రామైక్య సంఘాల సహకారంతో 600 మందికి పైగా నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించారు.
100 శాతం అక్షరాస్యత సాధనతో 2016లో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అప్పటి సర్పంచ్ మాడ్గుల సంజీవలక్ష్మి అవార్డు అందుకున్నారు.
సమష్టి కృషితోనే…
గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే వీర్నపల్లి సంసద్ ఆదర్శ గ్రామ్ యోజనలో దేశంలోనే ఏడో ర్యాంకు సాధించింది. అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ మా ఊరిని దత్తత తీసుకొని అనేక అభివృద్ధి పనులు చేశారు. అలాగే పల్లె ప్రగతి కింద చేపట్టిన పనులతో గ్రామం రూపురేఖలు మారాయి. అన్ని వసతులు సమకూరడం, గ్రామానికి దేశంలోనే గుర్తింపు రావడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరింత అభివృద్ధి చేస్తాం.
-పాటి దినకర్, సర్పంచ్(వీర్నపల్లి)
చూడచక్కని గన్నేరువరం
గన్నేరువరం ఒక మారు మూల ముంపు గ్రామం. అనేక సమస్యలతో సతమతమయ్యేది. విద్య, వైద్యానికి, ఇతర వస్తువుల కోసం బెజ్జంకి లేదా కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. వారసంతకు కనీస స్థలం లేక రోడ్డు మీదే నిర్వహించే పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. ఒక్కో వసతిని కల్పించుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రత్యేక నిధులతో అవసరమైన పనులన్నీ చేయించారు. అలాగే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వంతో మాట్లాడి గన్నేరువరం గ్రామం పేరుమీదే కొత్త మండలాన్ని ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. ఇంకా పల్లె ప్రగతి కింద నెలనెలా వస్తున్న నిధులతో మండల కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా మార్చారు.
చేపట్టిన పనులు..
పల్లె ప్రగతి కింద మండల కేంద్ర చిత్రమే మారిపోయింది. జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సర్పంచ్ పుల్లెల లక్ష్మి, వైస్ ఎంపీపీ స్వప్న, పాలక వర్గం కృషితో అన్ని వసతులు సమకూర్చుకుంది. స్వచ్ఛతలో నంబర్‌వన్‌గా ఉంది. గ్రామంలో వారసంత నిర్మించారు. పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామం, రైతు వేదిక, కుల సంఘాల భవనాలు, వీధివీధినా సీసీ రోడ్లు, రైతు కల్లాలు, వందశాతం ఇంకుడు గుంతలు, ఐఎస్ఎల్ నిర్మాణాలు చేయించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగుతున్నది. ఇటీవలే మండల కేంద్రానికి బస్సు సౌకర్యం సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 6న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంసద్ ఆదర్శ్ యోజనలో ఉత్తమ గ్రామంగా ఎంపికైంది. దేశంలోనే నాలుగో ర్యాంకును సొంతం చేసుకుంది.
మరింత అభివృద్ధి చేస్తాం
ఎమ్మెల్యే రసమయి, జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, అధికారుల సహాయ సహకారాలు, ప్రజలు, పాలకవర్గ సభ్యుల సమష్టి కృషితోనే ప్రత్యేక గుర్తింపు దక్కింది. అప్పటి ఎంపీ, ప్రస్తుత ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే ఉత్సాహంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ప్రజలకు కావల్సిన అన్ని వసతులు సమకూర్చుకుంటాం.
– పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్, సర్పంచ్ (గన్నేరువరం)
రామకృష్ణాపూర్‌కు జాతీయ ఖ్యాతి
రామకృష్ణాపూర్ మండలంలో చాలా చిన్న పంచాయతీ. గ్రామంలో జనాభా 550 ఉండగా, ఓటర్లు 415 మంది ఉన్నారు. ఏండ్లపాటు అనుబంధ గ్రామంగా.. అభివృద్ధికి దూరంగా చీకట్లో మగ్గింది. రోడ్లు, డ్రైనేజీలు లేక అవస్థలు పడింది. కానీ స్వరాష్ట్రంలో కాస్త తేరుకుంది. మూడేళ్ల క్రితం కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయడం, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకురావడంతో ప్రగతిబాట పట్టింది. సమస్యలన్నీ పరిష్కరించుకుంది. ప్రతి సంక్షేమ పథకాన్ని సర్పంచ్ మ్యాకల సమ్మిరెడ్డి, పాలకవర్గం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అన్ని విధాలా అభివృద్ధి చెంది ఆదర్శ గ్రామంగా పేరుపొందింది. ఈ క్రమంలో కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించగా, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చేపట్టిన పనులు..
పల్లె ప్రగతి కింద ప్రభుత్వం ప్రతి నెలా నిధులు ఇస్తుండడంతో అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నారు. వీధివీధినా సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించుకున్నారు. నిత్య పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతూ స్వచ్ఛ గ్రామంగా మార్చుకున్నారు. ఒకప్పుడు బోరు నీళ్లే దిక్కయిన గ్రామస్తులు ఇంటింటికీ వస్తున్న మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నారు. ఇంకా చెత్తతో ఎరువును తయారు చేసి రైతులకు విక్రయిస్తూ పంచాయతీకి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీలు.. ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల వసతులను సమకూర్చుకుంటూ ఆదర్శ గ్రామంగా నిలుపుకున్నారు.
ప్రజల సహకారంతోనే..
ప్రజల సహకారం, పాలకవర్గం కృషితోనే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. గ్రామాన్ని నిత్యం స్వచ్ఛంగా ఉంచుతున్నాం. చెత్తను ఎరువుగా మార్చి విక్రయిస్తూ పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. ఒకప్పుడు సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ మా గ్రామానికి పల్లె ప్రగతి పథకం కొత్త అందాన్నిచ్చింది. గ్రామ అభివృద్ధికి సహకరించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– మ్యాకల సమ్మిరెడ్డి, సర్పంచ్ (రామకృష్ణాపూర్)