మంగళవారం 27 అక్టోబర్ 2020
Jayashankar - Jun 18, 2020 , 03:11:47

గంగారం.. అవార్డుల సింగారం

గంగారం.. అవార్డుల సింగారం

  •  గ్రామానికి మరోసారి జాతీయ పురస్కారం
  • ఈసారి ‘స్వశక్తీకరణ్‌' కింద రూ.10లక్షల పారితోషికం
  • రెండు అవార్డులతో మార్మోగుతున్న ఊరి పేరు
  • గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో హర్షం

గంగారం.. ఈ పల్లె గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. నాడు బాహ్య ప్రపంచానికి తెలియని ఈ ఊరు, ఇప్పుడు వరుస పురస్కారాలతో దేశావ్యాప్త గుర్తింపు పొందింది. గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషి, రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం.. గ్రామానికి ఘన క్తీరిని తెచ్చిపెట్టాయి. గత ఏప్రిల్‌లో ‘గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)’ జాతీయ అవార్డు దక్కగా, తాజాగా మంగళవారం ‘దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్‌' పురస్కారంతో మరోసారి ఊరు మెరిసింది.      -కాటారం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామ సిగలో మరో పురస్కారం వచ్చి చేరింది. ఇటీవల ఏప్రిల్‌ 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఊరికి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) అవార్డు అందించింది. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రకటించిన అవార్డుల్లో మరోసారి స్థానం దక్కించుకోవడం విశేషం. ఇందులో రాష్ర్టానికి ఏడు పురస్కారాలు రాగా వాటిలో జనరల్‌ కేటగిరీలో గంగారం గ్రామం దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్‌ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రధాని నుంచి మొదటి పురస్కారం కింద రూ.5లక్షల పారితోషికం అందుకోగా, తాజాగా రెండో అవార్డుతో ఈ ఊరి ఖాతాలో మరో రూ.10లక్షల పారితోషికం జమకానుంది. 

ప్రగతితోనే అవార్డులు

2018-19లో గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గాను ఒకే ఏడాదిలో రెండు వేర్వేరు జాతీయ స్థాయి అవార్డులు దక్కడం విశేషం. పంచాయతీలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, మౌలిక వసతుల కల్పన, గ్రామసభ తీర్మానాలను పక్కాగా అమలుచేయడం, ఎప్పటికప్పుడు జరిగే పనులను ఆన్‌లైన్‌ చేయడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడడం, పన్నుల వసూళ్లు, వార్షిక ప్రణాళిక ఇలా అన్నింటినీ పక్కాగా అమలుచేయడం వల్లే అవార్డు వరించింది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంత, వాడవాడకూ సీసీరోడ్లు నిర్మించి ఇరువైపులా మొక్కలు నాటడం, వీధిదీపాలు అమర్చి అందరి దృష్టినీ ఆకర్షించారు.

ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందించారు. వైకుంఠధామం, డంప్‌యార్డు నిర్మాణంలో ఉన్నాయి. హెల్త్‌ సబ్‌సెంటర్‌ను వెల్‌నెస్‌ సెంటర్‌గా మార్చి వైద్యంతో పాటు దివ్యాంగులకు, గ్రామస్తులకు ఫిజియోథెరపీ, వ్యాయామం, ధ్యానం చేయిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, పల్లె ప్రగతిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ ఆదర్శంగా నిలు స్తున్నారు.

ఒకే మాట.. ఒకే బాట.. 

సమష్టితత్వమే గ్రామాన్ని ప్రగతి బాట లో నడిపిస్తున్నది. ఒకే మాట, ఒకే బాట, ఒకే నినాదం ఈ ఊరి విజ యానికి సోపనాలుగా చెప్పవచ్చు. ఇక్కడ నిర్వహించే గ్రామసభ ల్లో ప్రజలను, మహిళలను, యువతను, విద్యార్థులను భాగస్వామ్యులను చేసి అందరి ఆలోచనలకు అనుగుణంగా తీర్మానాలు చేస్తారు. వాటిని పాలకవర్గం తప్పకుండా అమలుచేస్తుంది. ప్రజా చైతన్యంతోనే ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంత నిర్మించుకోగా అందరూ కలిసికట్టుగా  కూరగాయలు సాగు, ఆధునిక వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. యువత ఇటు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇలా అందరి కృషి, సర్కారు ప్రోత్సాహం కలగలిపి గంగారానికి ఇంతటి ఖ్యాతి దక్కిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అవార్డులతో  బాధ్యత మరింత పెరిగింది

మా ఊరికి రెండు కేంద్ర పుర స్కారాలు రావడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మా పాలకవర్గ సభ్యులు, అధికారులు, గ్రామస్తుల సహకారం వల్లే ఇప్పుడు అభివృద్ధిలో ముందున్నాం. అవార్డులతో మా గంగారం గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నాపై మరింత బాధ్యత పెరిగింది. మున్ముందు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తా. 

- తెప్పల దేవేందర్‌రెడ్డి,  సర్పంచ్‌, గంగారం


logo