e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home జనగాం ప్రగతి సింగారం

ప్రగతి సింగారం

పేరుకు తగ్గట్లే ప్రగతి సాకారం
అద్దంలా రోడ్లు.. వీధులు
ఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రకృతి వనం
రూరల్‌ జిల్లాలోనే రెండో మోడల్‌గా పంచాయతీ భవనం
రూ.కోటితో కమ్యూనిటీ హాల్‌
ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ పక్కా భవనాలు
సీఎం కేసీఆర్‌ ఇచ్చిన రూ.2.50కోట్ల ప్రత్యేక నిధులతో గ్రామానికి మహర్దశ
శాయంపేట, మార్చి 19 : ప్రగతి సింగారం.. పేరుకు తగినట్లుగానే ఈ గ్రామం ప్రగతిని సింగారించుకున్నది. పల్లెప్రగతి నిధులను సద్వినియోగం చేసుకుని స్వరూపాన్నే మార్చుకున్నది. రోడ్లు అద్దంలా మెరుస్తుండగా, వీధులు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. హరితహారం మొక్కలతో ఊరంతా పచ్చదనం పరుచుకున్నది. ఆహ్లాదం పంచే ప్రకృతివనం, ఆధునిక హంగులతో నిర్మించిన గ్రామ సచివాలయం గ్రామానికే వన్నె తెచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ పక్కా భవనాలుండగా, రూ.కోటితో కమ్యూనిటీ హాల్‌ సిద్ధమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.2.50 కోట్ల నిధులతో ఈ ఊరికి మహర్దశ పట్టింది.

మండల కేంద్రంనుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రగతి సిగారంలో అడుగుపెట్టగానే రోడ్లకు ఇరువైపులా పెరిగిన హరితహారం చెట్లు ఆహ్లాదం పంచుతూ స్వాగతం పలుకుతాయి. గ్రామంలో మూడు వేలమంది జనాభా ఉండగా, పది వార్డులున్నాయి. ఓటర్లు 1508 మంది ఉండగా, 503 ఇండ్లున్నాయి. ఇక్కడ మిషన్‌ భగీరథతో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందుతున్నది. రోజూ ఇంటింటికీ ట్రాక్టర్‌ను తిప్పుతూ జీపీ సిబ్బంది చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. డ్రైనేజీలను ఎప్ప టికప్పుడు శుభ్రం చేస్తున్నారు. దీంతో గ్రామ పరిసరాలు శుభ్రంగా మారి సీజనల్‌ వ్యాధుల బెడద లేకుండా పోయింది. గ్రామంలో 90శాతం సీసీ రోడ్లు నిర్మించారు. వైకుంఠధామం పనులు చివరి దశలో ఉన్నాయి. గ్రామం మధ్యలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం ఊరికే కొత్తందాన్ని తెచ్చింది. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా గ్రామంలో 25 పాడుబడిన ఇండ్లను తొలగించారు. మండలంలోనే తొలిసారి 55 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు ఇక్కడ శంకుస్థాపన చేశారు. రూ.58లక్షలతో ఆధునిక హంగులతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం జిల్లాలోనే రెండో మోడల్‌ జీపీ భవనంగా నిలిచింది. పంచాయతీ సిబ్బందికి బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.

- Advertisement -

అభివృద్ధి పనులు ఇలా..
రూ. 22లక్షలతో రైతువేదిక, రూ.10లక్షలతో హెల్త్‌ సబ్‌సెంటర్‌, రూ.2.50 లక్షలతో గ్రంథాలయ భవనం, రూ.20లక్షలతో రెండు అంగన్‌వాడీ కేంద్రం భవనాలు, రూ.8లక్షలతో పెద్దమ్మ, పోచమ్మ ఆలయాలు, రూ.3.40 లక్షలతో బస్టాండ్‌ నిర్మించారు. రూ.12లక్షలతో వైకుంఠధామం, రూ.2.50లక్షలతో డంపింగ్‌ యార్డు పనులు చేపట్టారు. రూ.3లక్షలతో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేశారు. వీటి తోపాటు పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. సుమారు రూ.కోటీ 22 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. కూరగాయల షెడ్డు నిర్మాణానికి డీఆర్‌డీఏ నుంచి రూ.12 లక్షలు మంజూరయ్యాయి. రూ.8.50లక్షలతో సైడ్‌ డ్రైనేజీలు నిర్మించారు. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా జీపీకి రూ.2.38 లక్షల నిధులు వస్తున్నాయి.

సీఎం ప్రత్యేక నిధులు రూ.2.50కోట్లు
2017లో మెగా టెక్స్‌టైల్‌ పార్కు శంకుస్థాపన సందర్భంగా వరంగల్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ను గ్రామాభివృద్ధికి నిధులివ్వాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. ప్రగతిసింగారం ఎమ్మెల్యే స్వగ్రామం కావడంతో సీఎం కేసీఆర్‌ రూ.2.50కోట్లను ఎస్‌డీఎఫ్‌గా మంజూరు చేశారు.

పల్లె ప్రగతితోనే అభివృద్ధి
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామంలో అన్ని విధాలా అభివృద్ధి జరిగింది. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాం. జీపీ సిబ్బంది పనితీరు మెరుగుపరిచేందుకు, సమయపాలన కోసం బయో మెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నాం. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్రజ్యోతికి కృతజ్ఞతలు.
-పోతు సుమలతారమణారెడ్డి, సర్పంచ్‌

పల్లె ప్రగతితోనే స్పష్టమైన మార్పు
గ్రామంలో ప్రజలకు కావాల్సిన అవసరాలను గుర్తించి పనులు చేపట్టాం. మల్టీపర్పస్‌ వర్కర్లకు రూ.8500 వేతనం పెంచడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు సక్రమంగా జరుగుతున్నాయి. పల్లెప్రగతితోనే ప్రగతిసింగారంలో స్పష్టమైన మార్పు వచ్చింది.
-సాయబోయిన కిరణ్‌, పంచాయతీ కార్యదర్శి

పనులు మంచిగ జరుగుతున్నయ్‌
సీఎం కేసీఆర్‌ వల్లే గ్రామాల్లో మంచిగ పనులు జరుగుతున్నయ్‌. బజార్లు ఊడ్చుడు, చెట్లకు నీళ్లుపోసుడు బాగా చేస్తున్నరు. రోజూ ట్రాక్టర్లు నడుస్తున్నయ్‌. వాడల్లో చెత్తాచెదారం లేకుంట ఊడ్పిస్తున్నరు. ఎప్పటికప్పుడు మోరీలు తీస్తుండడంతో రోగాలు రాకుండా మంచిగున్నది.

  • కోసరి సమ్మయ్య, గ్రామస్తుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement