గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Jan 12, 2020 , 04:52:40

పదో రోజు.. అదే జోరు

పదో రోజు.. అదే జోరు
  • -ముమ్మరంగా ‘పల్లె ప్రగతి’ అభివృద్ధి పనులు
  • -రామవరం గ్రామాన్ని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి
  • -చెట్లకు రంగులు వేసిన దయాకర్‌రావు
  • -పాఠశాల రంగులకు గ్రామస్తుల సాయం
  • -నేడు ముగియనున్న ‘ప్రత్యేక’ కార్యక్రమం

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గ్రామాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి చేపట్టిన పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం పనులు శనివారం పదో రోజుకు చేరాయి. రెండో విడతలో ప్రధానంగా నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఈ మూడు అంశాల్లో జిల్లా నూరుశాతం ఫలితాలను సాధించిందని చెప్పొచ్చు. ఇవి కాకుండా గ్రామాల్లో ఇతర సమస్యలను పరిష్కరిస్తున్నారు. హరితహరం, ఇంకుడుగుంతల నిర్మాణం, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ప్లాస్టిక్‌ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం గ్రామాల్లో సభలతో ముగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 11 రోజుల్లో జరిగిన పురోభివృద్ధిపై సమావేశంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడనున్నారు.

పనులను పరిశీలించిన మంత్రి

కొడకండ్ల మండలం రామవరం గ్రామాన్ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీ, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వీధుల్లోని చెట్లకు మంత్రి స్వయంగా రంగులు వేసి, నర్సరీలో మొక్కలకు నీళ్లు పట్టి స్ఫూర్తినిచ్చారు. పల్లెప్రగతి సంపూర్ణ లక్ష్యాలు చేరుకోవాలని మంత్రి సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. అపరిశుభ్రత ఉంటే కచ్చితంగా జరిమానాలు విధిస్తామన్నారు. పల్లెల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని స్పష్టం చేశారు. పెండింగ్‌ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. చిలుపూర్‌ మండలంలోని పల్లగుట్ల, వెంకటాద్రిపేట, శ్రీపతిపల్లి, లింగంపల్లి గ్రామాల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య పర్యటించారు. పది రోజుల కార్యక్రమంలో చేపట్టిన పనుల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆయా గ్రామాల్లోని పనుల పురోగతిపై ఆరా తీశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను చూశారు. ప్రజలు సంఘటితంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, చెట్లను విరివిగా పెంచాలన్నారు. జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి, అధికారులు, నేతలు పాల్గొన్నారు. పాలకుర్తిలో ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, మానవహరం చేపట్టారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ ఉషాదయాకర్‌రావు, ఆర్డీవో రమేశ్‌, ఎంపీపీ నాగిరెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషాదయాకర్‌రావు మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనగామ మండలం ఓబుల్‌కేశవపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు రంగులు వేయడానికి గ్రామస్తులు ఆనంద్‌రెడ్డి రూ. 35 వేలు, జనార్దన్‌రెడ్డి రూ. 5 వేలు, నర్సింగరావు రూ. 3 వేల ఆర్థిక సాయం అందించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు నిర్వహించారు. కొడకండ్ల మండలంలో డీపీవో వెంకటేశ్వర్‌రావు, డీఎల్‌పీవో కనకదుర్గ వివిధ గ్రామాల్లో పర్యటించి నర్సరీలను పరిశీలించారు.


logo
>>>>>>