టెహ్రాన్: జియోనిస్ట్ పాలకులు ఇంకా నేర్చుకోలేదని ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ విమర్శించారు. లెబనాన్‌లో బలమైన హిజ్బుల్లాకు పెద్ద నష్టం కలిగించడానికి వారు చాలా చిన్నవారని ఇజ్రాయెల్‌పై మండిపడ్డారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించడంపై శనివారం ఖమేనీ స్పందించారు. ‘లెబనాన్‌లో రక్షణ లేని ప్రజల ఊచకోత మరోసారి జియోనిస్ట్ వెర్రి కుక్క క్రూరత్వాన్ని అందరికీ వెల్లడించింది. దోపిడీ పాలనలోని నాయకుల చిన్న చూపు, మూర్ఖపు విధానాన్ని ఇది రుజువు చేసింది’ అని విమర్శించారు.
కాగా, ఇజ్రాయెల్ దురాక్రమణను ఎదుర్కొనేందుకు హిజ్బుల్లా మరింత బలపడుతుందని ఖమేనీ తెలిపారు.
‘లెబనాన్‌లో పటిష్టమైన హిజ్బుల్లా నిర్మాణంపై పెద్ద నష్టాన్ని కలిగించడానికి వారు చాలా బలహీనంగా ఉన్నారన్నది జియోనిస్ట్ నేరస్థులకు తెలియజేయండి’ అని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలోని అన్ని ప్రతిఘటన శక్తులు హిజ్బుల్లాకు మద్దతుగా నిలువాలని కోరారు. ‘జియోనిస్ట్ పాలనలోని తీవ్రవాద ముఠా గాజాలో ఏడాది పాటు పాల్పడిన యుద్ధ నేరాల నుంచి ఏమీ నేర్చుకోలేదు. మహిళలు, పిల్లలు, పౌరుల మారణకాండను అర్థం చేసుకోలేదు. బలమైన ప్రతిఘటన నిర్మాణాన్ని వారు దెబ్బతీయలేరు’ అని అన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో అల్లాడుతున్న లెబనాన్ ప్రజలకు సంఘీభావంగా ఉండాలని ప్రపంచంలోని ముస్లిం సమాజానికి ఖమేనీ పిలుపునిచ్చారు.‘లెబనాన్ ప్రజలకు, గర్వించదగిన హిజ్బుల్లాకు అన్ని మార్గాల్లో మద్దతుగా ఉండండి. దోపిడీ, అణచివేత దోరణితో ఉన్న దుర్మార్గపు ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవడంలో వారికి సహాయం చేయడం ముస్లింలందరి బాధ్యత’ అని అన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని ప్రతిఘటన శక్తులు హిజ్బుల్లాకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.