న్యూఢిల్లీ, మార్చి 3: రష్యాకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో మద్దతు తెలియచేసిన అమెరికా పట్ల ఉక్రెయిన్‌కు కృతజ్ఞతాభావం లేదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిందించిన దరిమిలా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. అమెరికా ప్రాధాన్యతను తాను అర్థం చేసుకోగలనని, ఆ దేశం చేసిన సాయానికి తాము రుణపడి ఉంటామని సోమవారం ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో జెలెన్స్కీ ప్రకటించారు.
అమెరికా చేసిన సాయానికి కృతజ్ఞత లేదని, తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందం షరతులను అంగీకరించడం లేదంటూ శుక్రవారం రాత్రి వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో జెలెన్స్కీపై అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ తాజాగా వీడియో సందేశం విడుదల చేశారు.
అమెరికా పట్ల కృతజ్ఞతను తాము ఒక్కరోజు కూడా మరచిపోలేదని ఆయన చెప్పారు. శాంతి పునరుద్ధరణ జరగాలని, భద్రతాపరమైన హామీలు వాస్తవ హామీలు కావాలని ఆయన అన్నారు. యూరపు ఖండం, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, తుర్కియే అన్నీ కూడా ఒకే వైఖరితో ఉన్నాయని ప్రకటించారు. లండన్‌లో ఆదివారం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయెల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పాల్గొన్నారు.
ఉక్రెయిన్,రష్యా మధ్య యుద్ధం ముగించే ఒప్పందం చాలా చాలా దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారంరాత్రి ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తన సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
అమెరికాతో తమ సంబంధాలు కొనసాగుతాయని తాను భావిస్తున్నానని, అవి సందర్భోచిత సంబంధాలు కావని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి ఆర్థిక సాయం నిరంతరం కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, యుద్ధం ముగింపు చాలా దూరమన్న జెలెన్స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు. ఇది వరస్ట్ స్టేట్మెంట్ అని దుయ్యబట్టారు. జెలెన్స్కీ శాంతిని కోరుకోవట్లేదని విమర్శించారు.