టెక్ ఔత్సాహికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ 14 మొబైల్ లాంచ్ అయిపోయింది. దీనిలో ఇచ్చిన కొన్ని ఫీచర్లు అందరికీ తెగ నచ్చేశాయి. వాటిలో ముఖ్యమైనది క్రాష్ డిటెక్షన్ ఫీచర్. అంటే మనం కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే.. దీన్ని గుర్తించిన ఐఫోన్ వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందిస్తుంది.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? అని ఒక యూట్యూబర్‌కు అనుమానం వచ్చింది. అందుకే ఒక 2005 మోడల్ మెర్క్యూరీ గ్రాండ్ మార్కయిస్ కారులో ఐఫోన్‌ను పెట్టి యాక్సిడెంట్ చేశాడు. రిమోట్ కంట్రోల్‌తో కారుకు యాక్సిడెంట్ చేసి, ఈ మొత్తాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్లో పోస్టు చేశాడు. మొత్తం రెండుసార్లు ఇలా యాక్సిడెంట్ చేయగా.. రెండు సార్లూ ఐఫోన్ ఫీచర్ పనిచేసిందని, ఎమర్జెన్సీ సేవలకు కాల్ చేసిందని ఈ యూట్యూబర్ తేల్చాడు.
అయితే కొంచెం లేట్ అయిందన్నాడు. ఇలా యాక్సిడెంట్ అవగానే పది సెకన్లపాటు ఐఫోన్లో టైమర్ వస్తుంది. ఈ టైమర్‌ను ఆపేస్తే యూజర్‌కు పెద్దగా ప్రమాదం లేనట్లు ఐఫోన్ భావిస్తుంది. ఒకవేళ యూజర్ తన మొబైల్లో టైమర్ ఆపలేకపోతే.. వెంటనే అత్యవసర విభాగానికి, అతని మొబైల్లోని కాంటాక్టులకు మెసేజిలు పంపుతుంది.