కాఠ్మాండూ : నేపాల్ యువతలో పెరుగుతున్న అసంతృప్తి మరోసారి వీధుల్లో నిరసన రూపం దాల్చింది. గత మూడు రోజుల్లో ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి యత్నం చేశారు. ఇందులో ఇద్దరు చనిపోయారు. ప్రధాని బాలేంద్ర షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత కాఠ్మాండూ వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. బాలేంద్ర షా ప్రజా వ్యతిరేక, నిరంకుశ ధోరణిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని జెన్-జీ నేపాల్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. యువత ఉపాధి, ఆదాయం పెంచేందుకు బడ్జెట్లో, విధానాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోలేదని విమర్శించింది. యువతలో ఆశ, విశ్వాసం నెలకొల్పడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేపాలీ కాంగ్రెస్ ఆరోపించింది.
యువత ఆత్మాహుతి చేసుకోవడాన్ని ప్రభుత్వ వైఫల్యంగా 2023లో బాలెన్ షా అభివర్ణించారు. తాజా నిరసనల సందర్భంగా నాడు ఆయన అన్న ఆ మాటలపై ప్రజలు చర్చించుకొంటున్నారు. తాజా ఆందోళనలపై ఆయన మౌనం వహించడాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. యువత మానసిక ఆరోగ్యం క్షీణించడం, నిరుద్యోగం పెరుగడం, ప్రభుత్వ విధానాల ప్రభావంపై తాజా నిరసనలు మళ్లీ ఆందోళనను రేకెత్తించాయి. యువత సమస్యలపై ప్రభుత్వం అర్థవంతమైన చర్యలు తీసుకోకపోతే నిరసనల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు హెచ్చరించాయి.