Yagi Typhoon : వియత్నాం (Vietnam) లో యాగి తుపాను (Yagi Typhoon) బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వర్షం (Heavy rain), బలమైన ఈదురుగాలులు (Strong winds), కొండచరియలు విరిగిపడటం (Landslides), పోటెత్తిన వరదలు (Flash floods) ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ టైఫూన్ ధాటికి ఆ దేశంలో ఇప్పటికే 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 59 మంది గల్లంతయ్యారు.
వియత్నాం వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్‌కు చెందిన వారు, 45 మంది లావో కై ప్రావిన్స్‌కు చెందిన వారు, 37 మంది యెన్ బాయి ప్రావిన్స్‌కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. అయితే క్యూయెట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే డైక్ నదికి భారీ నీటి ప్రవాహం పోటెత్తడంతో వరద ముంచెత్తింది.
ఈ విషయాన్ని తుయెన్ క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు ధ్రువీకరించింది. రాజధాని హనోయిలోని ఎర్ర నదిపై వరద స్థాయి మూడో హెచ్చరికలను దాటింది. బుధవారం మధ్యాహ్నానికి అత్యధిక స్థాయికి చేరుకుంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అలాగే థావో నది నీటి మట్టం పెరిగి దాని సమీప ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. ఉత్తరాదిలోని నదులపై వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది.