Iceberg | లండన్: ప్రపంచంలోని అతి పెద్ద హిమఖండం ఏ23ఏ నెమ్మదిగా కదలడం ప్రారంభమైంది. 30 ఏళ్లకుపైబడి ఉన్న ఈ మంచుకొండ క్రమంగా దక్షిణ మహాసముద్రంలోకి జారుతున్నది. ఇది గ్రేటర్ లండన్‌కు రెండింతలు పెద్దది. దీని బరువు సుమారు లక్ష టన్నులు ఉంటుంది. ఇది అంటార్కిటికాలోని ఫిల్చనర్ ఐస్ షెల్ఫ్ నుంచి 1986లో విడిపోయింది. వెడ్డెల్ సముద్రంలోని దక్షిణ ఓర్క్నీ ద్వీపాల వద్ద చిక్కుకుంది. 2020లో ఉత్తర దిశగా నెమ్మదిగా కదలడం మొదలైంది.
బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన ఓషనోగ్రాఫర్ డాక్టర్ ఆండ్రూ మెయిజెర్స్ మాట్లాడుతూ, కొంత కాలం నిశ్చలంగా ఉన్న తర్వాత మళ్లీ ఈ హిమఖండం కదులుతుండటం ఉత్తేజితంగా ఉందన్నారు. గతంలో పెద్ద హిమఖండాలు వెళ్లిన దారిలోనే ఇది కూడా వెళ్తుందా? అని ఆసక్తిగా చూస్తున్నామని చెప్పారు. స్థానిక పర్యావరణ వ్యవస్థపై దీని ప్రభావం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు.