లండన్: యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom)లో అబార్షన్స్ లీగలే. కానీ అబార్షన్ పిల్స్ వేసుకున్న ఓ మహిళకు 28 నెలల జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే.. 2020లో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో యూకేకు చెందిన ఓ 44 ఏండ్ల మహిళ గర్భవతిగా ఉన్నది. అయితే ఆస్పత్రుల్లో పరిస్థితిని చూసి ఆందోళన చెందిన ఆమె.. అబార్షన్ కోసం పిల్స్ వేసుకుంది.
దాంతో ఆమె గర్భాన్ని కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన యూకే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆమెకు 28 నెలల జైలుశిక్ష విధించింది. యూకే అబార్షన్స్ చట్టబద్దమే అయినా ఆమెకు శిక్ష పడింది. ఎందుకంటే యూకే చట్టం నిర్దేశించిన పరిమితిని ఉల్లంఘించి ఆమె గర్భ విచ్చత్తి చేసుకుంది.
యూకే చట్టం ప్రకారం.. ఓ గర్భిణి తన గర్భాన్ని తొలగించుకోవాలంటే పిండం వయసు 24 వారాల లోపు ఉన్నప్పుడే ఆ పని చేయాలి. కానీ సదరు మహిళ మాత్రం పిండం వయసు 32 నుంచి 34 వారాల మధ్య ఉన్నప్పుడు పిల్స్ వేసుకుని గర్భం తీసేసుకుంది. కాబట్టి అక్కడ అబార్షన్స్ లీగలే అయినా, అందుకు అనుమతించిన సమయం మీరిన తర్వాత ఆమె గర్భ విచ్ఛిత్తి చేసుకుంది కాబట్టి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.