పాట్నా, జనవరి 10: ‘మహిళను గర్భవతిని చేసి రూ.10 లక్షల బహుమతి పొందండి’ అంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రకటనలు బీహార్‌లో కొత్త రకం మోసానికి తెర తీశాయి. అఖిల భారత గర్భిణి ఉద్యోగంగా వర్ణిస్తూ సోషల్ మీడియాలో ప్రకటనలు వెల్లువెత్తాయి. ఉచితంగా లైంగిక సుఖం దొరకడంతోపాటు నగదు బహుమతి కూడా దక్కుతుందని ఉత్సాహపడిన పురుష పుంగవులు ప్రాథమిక చార్జీల కింద కొంత డబ్బును చెల్లించారు. చివరకు తాము మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించారు. సంతానం లేని మహిళలను గర్భవతిని చేసి నగదు బహుమతిని పొందండంటూ పురుషుల బలహీనతలతో ఆడుకుని డబ్బు పోగేసుకున్న ఓ ఆన్లైన్ స్కామ్స్టర్లను బీహార్‌లోని నవాద సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ వడ్డీకి రుణాలు, నకిలీ ఉద్యోగాల పేరిట కూడా ఈ ముఠా ప్రజలను మోసగించినట్లు పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి నవాదకు చెందిన రంజన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరారోపణలతో ఓ మైనర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అఖిల భారత గర్భిణి సర్వీస్ పేరిట!
వినడానికి వింతగా అనిపించవచ్చు కాని ఈ ప్రకటనను ఉద్యోగ, రుణాలకు సంబంధించిన ప్రకటనలలో స్కామ్స్టర్లు చేర్చారు. ప్లేబాయ్ సర్వీసు అని తప్పుదారి పట్టించే శీర్షికలను ధని ఫైనాన్స్, ఎస్బీఐ చీప్ లోన్స్ వంటి నకిలీ ప్రకటనలలో జత చేసి అమాయక ప్రజలకు ఎర వేశారు. అంతేగాక వీటిని ఫేస్బుక్, వాట్సాప్‌లలో కూడా పంపించడం మొదలుపెట్టారు. ఒక మహిళను గర్భవతిని చేస్తే రూ.10 లక్షలు అందచేస్తామని నిందితులు వాగ్దానం చేశారు. ఒకవేళ విఫలమైనా బహుమతిలో సగం డబ్బు లభిస్తుందని కూడా నమ్మ బలికారు. తాము ఎంపిక చేసుకున్న ఫోన్ నంబర్లకు లేడీ మోడల్స్ ఫొటోలు పంపించి ఉచిత సెక్స్ ఆఫర్‌తో ఎరవేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు, హోటల్ చార్జీలు మొదలైనవి చెల్లించాల్సి ఉంటుందని నిబంధన పెట్టారు.