మన ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద కోసం వాళ్లకు టీ ఇస్తుంటాం. ఆ టీ చేసే కళనే తన స్పెషాలిటీగా మార్చుకుందా మహిళ. ఒక గంటలో ఏకంగా 249 టీలు పెట్టి గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. ఆమె పేరు ఇంగర్ వాలెంటైన్. సౌతాఫ్రికాకు చెందిన ఈ మహిళ మూడు ఫ్లేవర్లలో రూయిబోస్ టీ తయారు చేసింది.
ఇది ఒక హెర్బల్ టీ. దీనిలో సాధారణ, వనీలా ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లలో ఈ టీలు తయారు చేసిందామె. రికార్డు సాధించడానికి కనీసం 150 టీలు తయారు చేయాల్సి ఉండగా.. స్పష్టమైన వ్యూహంతో పనిచేసిన ఆమె ఏకంగా 249 టీలు తయారు చేసి రికార్డు సృష్టించింది. మామూలుగా ఈ టీ తయారు చేయాలంటే.. టీ బ్యాగులను కనీసం 2 నిమిషాలపాటు కప్పులో నానబెట్టాలి.
ఈ సమయంలోనే మంచి స్ట్రాటజీ ఉపయోగించిన ఆమె.. మూడు టీలు తయారు చేసి టీ బ్యాగులు వాటిలో వేయగానే మరో బ్యాచ్ తయారు చేయడంలో మునిగిపోయింది. ఇలా చకచకా టీలు తయారు చేసి గంట ముగిసే సరికి 249 కప్పుల టీతో రికార్డులు బద్దలు కొట్టింది. ఆమె చేసిన టీ వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్న గిన్నిస్ బుక్ ప్రతినిధులు.. స్థానికులను ఆహ్వానించి, వారికి ఈ టీలు అందజేసింది.