Baggage Fee | బస్సు, రైలు ప్రయాణంలా ఉండదు విమానప్రయాణం. దీనికి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎయిర్ లైన్స్ ( Airlines) గైడ్ లైన్స్‌ను కచ్చితంగా ప్రతి ప్రయాణికుడు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది లగేజీ. బస్సు, రైల్లో ప్రయాణించినప్పుడు మనకు ఇష్టం వచ్చినంత లగేజీని తీసుకెళ్తుంటాం. అయితే, విమానంలో ప్రయాణం చేసేటప్పుడు అది కుదరదు. విమాన ప్రయాణంలో లగేజీపై కొంత పరిమితి ఉంటుంది. అంతకు మించి లగేజీని తీసుకెళ్తే ఫైన్ కట్టాల్సి (Baggage Fee) ఉంటుంది. అలా ఓ మహిళ అదనపు లగేజీకి డబ్బు కట్టకుండా తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చివరకు భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా ( Australia) కు చెందిన ఆడ్రియానా (Adriana) అనే యువతి తన స్నేహితులతో కలిసి టూర్‌కి వెళ్లింది. టూర్ పూర్తయ్యాక మెల్బోర్న్ (Melbourne ) నుంచి ఆడిలైడ్ (Adelaide)లోని తన ఇంటికి బయలుదేరింది. అయితే, విమానాశ్రయంలో చెకింగ్ సందర్భంగా తన లగేజీ గరిష్ట బరువు పరిమితి ఏడు కిలోల కంటే ఎక్కువగా ఉందని గ్రహించింది. దీంతో అదనపు లగేజీకి డబ్బు కట్టకుండా తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. తన బ్యాగ్‌లోని కొన్ని దుస్తులను తనే ధరిస్తే అదనపు ఛార్జీలు తగ్గుతాయని భావించింది. ఇందులో భాగంగానే తన లగేజీలోని 5.5 కిలోల బరువుగల దుస్తుల్ని ఒంటిపై వేసేసుకుంది. అయినా తన లగేజీ గరిష్ట బరువు పరిమితి కంటే ఒక కిలో ఎక్కువగానే చూపించింది. దీంతో ఎయిర్‌లైన్స్ సదరు యువతికి 65 డాలర్ల జరిమానా విధించింది.
తనకు ఎదురైన పరిస్థితి గురించి ఆ యువతి ఓ వీడియో ద్వారా స్వయంగా వెల్లడించింది. ‘నా లగేజీ గరిష్ట బరువు పరిమితి ఏడు కిలోల కంటే ఎక్కువగా ఉంది. దీంతో అదనపు లగేజీకి డబ్బు కట్టకుండా ఉండేందుకు బ్యాగ్‌లోని దుస్తుల్ని నేనే ధరిస్తే మంచిదని భావించా. బ్యాగ్‌లోని కొన్ని దుస్తుల్ని ఒంటిపై వేసుకున్నా. నా ప్యాంట్ జోబులో దాదాపు ఆరు పొరలు ఉన్నాయి. వాటిలో కొన్ని టీ-షర్టులు, ఎలక్ట్రానిక్ వస్తువులను నింపా. అయినా ఫైన్ కట్టాల్సి వచ్చింది. మమ్మల్ని చూసి అక్కడ లైన్లో నిల్చున్న వారంతా నవ్వుకున్నారు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇలా అన్ని దుస్తుల్ని ఒంటిపై ధరించి విమానంలో ప్రయాణించడం నాకే కాదు.. తోటి ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది కలిగించింది. నాలా మరెవ్వరూ ప్రయత్నించకండి’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read..
Ice Cream | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్.. ధర రూ.5లక్షల పైమాటే
Boris Johnson | 58 ఏళ్ల వయసులో.. 8వ బిడ్డకు తండ్రవుతున్న బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్
Rishi Sunak | ఏడాదిలో రూ.వేల కోట్లు ఆవిరైన సునాక్ దంపతుల సంపద