తైపీ సిటీ: తండ్రి పెన్షన్ కోసం అతడి కూతురు చాలా ఏళ్లుగా మృతదేహాన్ని దాచింది. (Woman Hides Father’s Body for Pension) హెల్త్ చెకప్ కోసం వచ్చిన ఆరోగ్య అధికారులను ఇంట్లోకి ఆమె రానివ్వలేదు. దీంతో అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేపట్టడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తైవాన్‌లో ఈ సంఘటన జరిగింది. ఆర్మీలో 20 ఏళ్లుగా పని చేసి రిటైర్డ్ అయిన మాజీ సైనిక అధికారికి నెలకు సుమారు రూ.1.20 లక్షల పెన్షన్ వస్తున్నది. సుమారు 50 ఏళ్లుగా కుమార్తె తన తండ్రితో కలిసి ఉంటున్నది.
కాగా, గత ఏడాది నవంబర్‌లో ఆ వృద్ధుడికి ఆరోగ్య పరీక్షల కోసం హెల్త్ అధికారులు ఆ ఇంటికి వచ్చారు. అయితే వారిని ఇంట్లోకి ఆమె రానివ్వలేదు. దీంతో ఆ మహిళకు రూ.1.50 లక్షల జరిమానా విధించారు. ఆమె ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో తండ్రి గురించి ఆమెను అడిగారు. అయితే పొంతన లేని సమాధానాలు చెప్పింది. నర్సింగ్ హోమ్‌లో ఉన్నట్లు తొలుత తెలిపింది. పోలీసులు గట్టిగా నిలదీయగా తండ్రిని తన సోదరుడు తీసుకెళ్లాడని చెప్పింది.
మరోవైపు ఆ మహిళ సోదరుడు 50 ఏళ్ల కిందటే చనిపోయినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అలాగే ఆమె తండ్రి తైవాన్ను వీడినట్లుగా రికార్డుల్లో ఎక్కడా నమోదు కాలేదు. దీంతో మరోసారి ఆ మహిళను పోలీసులు ప్రశ్నించారు. అయితే తన తండ్రి చనిపోయాడని, ధృవీకరణ పత్రం పొందలేదని ఆమె చెప్పింది. అనుమానించిన పోలీసులు చివరకు ఆ మహిళ ఇంట్లో సోదాలు చేశారు. ప్లాస్టిక్ చెత్త బ్యాగులో వృద్ధ వ్యక్తి ఎముకలను గుర్తించారు. ఆయన చాలా కాలం కిందట మరణించినట్లు గ్రహించారు.
కాగా, తండ్రి పెన్షన్ కోసం మృతదేహాన్ని కుమార్తె దాచినట్లు పోలీసులు తెలుసుకున్నారు. మాజీ సైనిక అధికారి అయిన ఆ వృద్ధుడి మరణంపై దర్యాప్తు చేస్తున్నారు. తైవాన్ చట్టాల ప్రకారం మృతదేహాన్ని అగౌరవపర్చడం, నాశనం చేయడం, వదిలేయడం, దొంగిలించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. సొంత వారే ఈ చర్యలకు పాల్పడితే మరింత కఠినంగా శిక్షిస్తారు.