మాస్కో: రష్యా టీవీ ఛానల్‌కు చెందిన ఓ మహిళా ఎడిటర్.. ఆ టీవీ న్యూస్ షోలో తన నిరసన గళం వినిపించారు. ఛానల్ 1 న్యూస్ ప్రోగ్రామ్‌లో యాంకర్ వార్తలు చదువుతున్న సమయంలో.. యుద్ధం వద్దు అంటూ ప్లకార్డు ప్రదర్శించి ఓ మహిళా ఎడిటర్ ఆ షోలో తన నిరసన వ్యక్తం చేశారు. ఆ ఎడిటర్ పేరు మారినా ఒసియాన్నికోవా. వాస్తవానికి రష్యా టీవీ ఛానళ్లు దాదాపు ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. అయితే ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంపై కేవలం క్రెమ్లిన్ ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే ఆ ఛానళ్లు ప్రసారం చేయాల్సి ఉంటుంది. పుతిన్‌కు వ్యతిరేకంగా యుద్ధం ఆపాలని ప్రదర్శన చేపట్టిన ఎడిటర్ ఓసియాన్నికోవాను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో నేరాలు జరుగుతున్నాయని, రష్యా ప్రభుత్వం తరపున పనిచేయడం సిగ్గుగా ఉందని ఆమె ఓ వీడియోను ఆ ఛానల్లో ప్రసారం చేసింది. యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని రష్యా ప్రజల్ని ఆమె కోరారు.