Hard Drive | న్యూఢిల్లీ : యూకేలో ఓ మహిళ తన మాజీ భాగస్వామి హార్డ్‌డ్రైవ్‌ను చెత్తబుట్టలో పడేసింది. అందులో అప్పటికే 8 వేల బిట్కాయిన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి విలువ 569 మిలియన్ పౌండ్లు. (దాదాపు రూ.5,900 కోట్లు). ఇప్పుడా హార్డ్‌డ్రైవ్ వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో లక్ష టన్నుల చెత్త కింద ఉండొచ్చని భావిస్తున్నారు. అతడు తనకో చెత్త బ్యాగును ఇచ్చి బయటపడేయాలని చెప్తే తీసుకెళ్లి పడేశానని, నిజానికి అందులో ఏముందో తనకు తెలియదని జేమ్స్ హౌల్స్ మాజీ గాళ్‌ఫ్రెండ్ అయిన హాల్ఫినా ఎడ్డీ ఇవాన్స్ వివరించింది.
దానిని కోల్పోవడం తన తప్పు కాదని పేర్కొంది. అతడు దానిని కనుగొనాలని ఆశిస్తున్నానని, అందులోంచి తనకు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదని జేమ్స్ హౌల్స్ను ఉద్దేశించి పేర్కొంది. అయితే, అతడు దీని గురించి మాట్లాడడం ఆపేయాలని కోరుకుంటున్నానని, అది మానసిక ఆరోగ్యానికి అంతమంచిది కాదని తెలిపింది. మరోవైపు, లక్ష టన్నుల చెత్తకింద ఉన్న డబ్బు (హార్డ్‌డిస్క్) కోసం హౌల్స్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చెత్త కింద ఉన్న డబ్బును సొంతం చేసుకుంటానని చెప్పుకొచ్చాడు.