Wagner Group | మాస్కో: వాగ్నర్ గ్రూప్ అనూహ్య తిరుగుబాటుతో రష్యాలో రేగిన ఆందోళన పరిస్థితులు సద్దుమణిగినట్టు కనిపిస్తున్నాయి. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ఒప్పందంలో భాగంగా రొస్తోవ్ను వీడి బెలారస్కు రోడ్డు మార్గంలో బయలుదేరినట్టు రష్యా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వాగ్నర్ దళాలు కూడా రొస్తోవ్ను వీడి తిరిగి సరిహద్దులోని తమ స్థావరాలకు వెళ్తున్నాయని ఆ ప్రాంత గవర్నర్ పేర్కొన్నారు. తిరుగుబాటు ప్రస్తుతానికి సద్దుమణిగినప్పటికీ, వాగ్నర్ గ్రూపు దళాలు రెండు నగరాలను స్వాధీనం చేసుకోవడం, రాజధాని మాస్కోకు దగ్గరగా రావడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
ఈ నేపథ్యంలో రష్యా సైన్యం సమర్థతతో పాటు అధ్యక్షుడు పుతిన్ శక్తి సామర్థ్యాలపైనా ప్రశ్నలు రేకెత్తాయి. తిరుగుబాటు పరిణామాల నేపథ్యంలో రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి అండ్రీ రుడెంకో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్తో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు గురించి అమెరికాకు కొద్ది రోజుల ముందే తెలుసునని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటుకు ప్రిగోజిన్ ఈ నెల మధ్య నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని పేర్కొన్నాయి.