వాషింగ్టన్ : వేగంగా ప్రయాణిస్తున్న భారీ విద్యుత్తు (Electric Vehicle) లారీకి వైర్‌లెస్‌గా ఛార్జింగ్ (Wireless Charging) చేయడంలో అమెరికన్ ఇంజినీర్లు విజయం సాధించారు. వెస్ట్ లాఫాయెట్టె, ఇండియానాలోని యూఎస్ హైవే 52/231లోని 400 మీటర్ల భాగంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ రోడ్డు కాంక్రీట్ కింద డైనమిక్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ సిస్టమ్‌ను పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు అమర్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన కమిన్స్ క్లాస్ 8 ఎలక్ట్రిక్ సెమీ ట్రాక్టర్‌ను ఈ రోడ్డుపై నడిపించారు. ఈ వాహనం గంటకు 65 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుండగా, దీని బ్యాటరీలోకి 190 కిలోవాట్ల విద్యుత్తు ఛార్జింగ్ అయింది. 100 సగటు ఇండ్లలో వినియోగించే విద్యుత్తుతో ఇది సమానం. ఎంతో కాలం నుంచి ఊహలకే పరిమితమైన ఈ విధానం ఆచరణ సాధ్యమైందని, విస్తరించదగినదిగా ఉందని పరిశోధకులు తెలిపారు.
ఎలా పని చేసింది?
ట్రాన్స్మిటర్ కాయిల్స్‌ను రోడ్డులో అమర్చారు. వీటి ద్వారా అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. వాహనం ఛాసిస్ కింద రిసీవర్ కాయిల్స్‌ను ఏర్పాటు చేశారు. లారీ ఈ కాయిల్స్పై నుంచి ప్రయాణిస్తుండగా, పేవ్మెంట్ గుండా పవర్ ట్రాన్స్ఫర్ అయింది. అప్పటికప్పుడు వాహనంలోని బ్యాటరీ సిస్టమ్‌కు ఈ విద్యుత్తు చేరింది. కాంక్రీట్ పేవ్‌మెంట్‌లలో ఉంటూ పని చేసే విధంగా ఈ కాయిల్స్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. వైర్లెస్ ఈవీ చార్జింగ్ కొత్త విషయం కాదని, హైవే స్పీడ్స్‌లో దాదాపు 200 కిలోవాట్లను విడుదల చేయడం అమెరికాలో మునుపెన్నడూ లేదని పరిశోధకులు తెలిపారు. హెవీ డ్యూటీ ట్రక్స్‌కు విపరీతంగా విద్యుత్తు అవసరమవుతుందన్నారు.