Operation Sindoor : భారత్ - పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా (China) పేర్కొంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు (Tensions) కొనసాగుతున్న నేపథ్యంలో బీజింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఇరుదేశాలు సంయమనం పాటించాలని చైనా (China) విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో సూచించింది.
‘భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులను మేం నిశితంగా గమనిస్తున్నాం. శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు సమయమనం పాటించాలని కోరుతున్నాం. శాంతియుత మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని, ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని సూచిస్తున్నాం. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని అంతర్జాతీయ సమాజం కూడా ఆశిస్తోంది. ఈ సమస్య ముగింపునకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని చైనా తన ప్రకటనలో పేర్కొంది.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (operation sindoor) పేరుతో పాకిస్థాన్‌లోని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దాంతో భారత్- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి.