Wildfire : కెనడా (Canada) లో కార్చిచ్చు కొనసాగుతోంది. సస్కెట్చివాన్ ప్రావిన్స్ (Saskatchewan Province) లో కార్చిచ్చు వ్యాపించడంతో అత్యవసర పరిస్థితి విధించారు. ఇప్పటికే మానిటోబా ప్రావిన్స్ (Manitoba Province) లో దీని కారణంగా దాదాపు 17 వేల మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాము తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని సస్కట్‌చెవాన్ ప్రావిన్స్ ప్రీమియర్ స్కాట్మో తెలిపారు.
విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు. సస్కట్‌చెవాన్ ప్రావిన్స్ నుంచి ఇప్పటికే 4 వేల మందిని తరలించారు. 6.69 లక్షల ఎకరాల్లో ఇది వ్యాపించింది. పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని, రానురాను సంక్లిష్టంగా మారే అవకాశముందని సిబ్బంది చెబుతున్నారు. మాంటోబా ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. చిన్నచిన్న ఊళ్లను ఖాళీ చేయిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఎన్నడూ ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రజలను తరలించేందుకు కెనడా వైమానిక దళం రంగంలోకి దిగింది. రెండు లేదా మూడు రోజలు వర్షం పడితేగానీ ఈ కార్చిచ్చు అదుపులోకి రాదని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి వస్తున్న పొగ.. అమెరికాలోని మిన్నెసోటా, మిషిగాన్ తదితర రాష్ట్రాల వైపు వెళుతోంది. రెండు ప్రావిన్సుల్లోనే 2025లో 15 లక్షల ఎకరాలు దగ్ధమయ్యాయి.
కెనడా సహజ వనరుల విభాగం లెక్కల ప్రకారం మొత్తం 6,000 కార్చిచ్చులు సంభవించి.. 3.7 కోట్ల ఎకరాలను కాల్చేశాయి. కెనడా కార్చిచ్చుల వల్ల అమెరికాలో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నట్లు ది అమెరికన్ లంగ్ అసోసియేషన్ 2025లో ఇచ్చిన స్టేట్ ఆఫ్ ది ఎయిర్ రిపోర్టు పేర్కొంది.