Wildfire in California : ఉత్తర కాలిఫోర్నియాలో గత బుధవారం ఒక వ్యక్తి చేసిన పనితో మొదలైన కార్చిచ్చు ‘ది పార్క్ ఫైర్ (The park fire)’ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం చొప్పున అడవిని కాల్చి బూడిద చేస్తోంది. ఒక వ్యక్తి కావాలని అడవికి నిప్పు పెట్టడంతో నాలుగు రోజుల క్రితం ఈ కార్చిచ్చు మొదలైనట్లు అనుమానాలున్నాయి. ఓ వ్యక్తి కాలిపోతున్న కారును రోడ్డుపక్కకు దొర్లించడంతో మంటలు మొదలైనట్లు సమాచారం. దాంతో 42 ఏళ్ల అనుమానితుడిని అరెస్టు చేసినట్లు తెలిసింది.
ఇప్పటివరకు ఇది ఈశాన్య చికోలో 3,48,000 ఎకరాలను దహనం చేసింది. కాలిఫోర్నియాలోని బుట్టె, టెహమ్మా కౌంటీల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రకటించారు. కాగా 2018లో ఈ ప్రాంతాల్లో వ్యాపించిన మంటలతో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుటి కార్చిచ్చును ఆర్పేందుకు దాదాపు 2,500 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా పెద్దగా పురోగతి లేదు. 16 హెలికాప్టర్లను మోహరించారు. ముఖ్యంగా ఎత్తైన కొండలు, గాలుల కారణంగా దీనిని అడ్డుకోవడం కష్టంగా మారింది.
కొన్ని చోట్ల మంటల సుడులు (ఫైర్నిడోలు) ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది కాలిఫోర్నియా రాష్ట్రం ఎదుర్కొన్న అతిపెద్ద కార్చిచ్చు ఇదే. కాల్ఫైర్ సంస్థ కమాండర్ బిల్లీ సీ మాట్లాడుతూ ఈ మంటలు గంటకు 5,000 ఎకరాలకు వ్యాపిస్తున్నాయని చెప్పారు. శనివారం అగ్నిమాపక సిబ్బంది సంఖ్యను మూడు రెట్లు పెంచినట్లు వెల్లడించారు. అయినా సిబ్బంది సరిపోవడంలేదనే చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో భారీగా గడ్డి పెరగడంతో దళాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. శనివారం ఒక్క రోజే 1.5 లక్షల ఎకరాలు కాలిపోయినట్లు వెల్లడించారు.
కాగా, ప్రస్తుతం వందల సంఖ్యలో కార్చిచ్చులు అమెరికా, కెనడాల్లో వ్యాపించాయి. ది నేషనల్ ఇంటర్ ఏజెన్సీ ఫైర్ సెంటర్ ప్రస్తుతం అమెరికాలోని పశ్చిమ తీరంలో వ్యాపించిన 102 కార్చిచ్చులపై దృష్టిపెట్టింది.