నదిలో డాల్ఫిన్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. అమెరికాలోని నదిలో ఓ బేబీ డాల్ఫిన్ కనిపించింది. అది పైకి ఎగురుతూ.. కిందికి దూకుతూ ఆహారం కోసం వెదుకుతోంది. నదిలో బేబీ డాల్ఫిన్‌ను చూసిన జంతు సంరక్షణ అధికారులు ఆశ్చర్యపోయారు. దీని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, వైరల్‌గా మారింది.
ఇది లాంగ్ ఐలాండ్ సౌండ్ నుంచి కనెక్టికట్ నదిలోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ డాల్ఫిన్‌ను మొదట థేమ్స్ నది వెంట మత్స్యకారులు గుర్తించారు. లాంగ్ ఐలాండ్ సౌండ్ నుంచి 15 మైళ్ల (24 కిలోమీటర్లు) దూరంలో ఉన్న నార్విచ్ మెరీనా సమీపానికి ఇది ఈదుకుంటూ వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దీన్ని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి పర్యవేక్షిస్తున్నారు. డాల్ఫిన్ బాల్యదశలో ఉందని అక్వేరియం యానిమల్ రెస్క్యూ టెక్నీషియన్ అలెగ్జాండ్రా కొజోకారు చెప్పారు. రక్షించాల్సిన అవసరం లేకుండానే అది చివరికి లాంగ్ ఐలాండ్ సౌండ్‌కు తిరిగి వెళ్లగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.