వాషింగ్టన్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్, కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. అత్యంత వేగంగా వ్యాప్తిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల నమోదు 21 లక్షలు దాటింది. ఒమిక్రాన్ బారిన పడిన ప్రతి దేశంలో వారం రోజుల్లోనే కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి వేగంపై అంతటా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆరోగ్య వ్యవస్థలను ఇది బాగా ప్రభావం చేయవచ్చని నిఫుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా, ఎపిడెమియాలజిస్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్-19 టెక్నికల్ హెడ్ మరియా వాన్ కెర్ఖోవ్, ఒమిక్రాన్ వేరియంట్ గురించి వివరించారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రధానంగా మూడు కారణాలని చెప్పారు. మొదటిది, ఈ వైరస్‌లో కనిపించే ఉత్పరివర్తనాలని, మానవ కణాలకు మరింత సులభంగా కట్టుబడి ఉండటానికి అవి అనుమతిస్తాయని తెలిపారు. రెండవది, మన రోగ నిరోధక ఎస్కేప్ అని చెప్పారు. అంటే ప్రజలు గతంలో ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నట్లయితే లేదా టీకాలు వేసినట్లయితే, వారు మళ్లీ కరోనా బారిన పడే అవకాశమన్న మాట.
ఇక ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడానికి మూడో కారణం, మానవుల ఊపిరితిత్తుల్లోని ఎగువ శ్వాసకోశంలో ఈ వేరియంట్ ప్రతి రూపాలు చెందుతున్నదని కెర్ఖోవ్ తెలిపారు. కరోనా తొలి స్ట్రెయిన్తోపాటు డెల్టా, ఇతర రూపాంతరాలకు ఇది చాలా భిన్నమని అన్నారు. అవన్నీ కూడా ఊపిరితిత్తుల్లోని దిగువ శ్వాసకోసంలో ప్రతిరూపాలు చెందుతాయని చెప్పారు. ఈ మూడు కారణాలకు తోడు, ప్రజలు మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం వల్ల కూడా ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని తెలిపారు.
మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టడం కూడా చాలా సులభమని కెర్ఖోవ్ అన్నారు. టీకాలు తీసుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడం, పెద్ద సమావేశాలకు దూరంగా ఉండటం వంటి చర్యలకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు. దీంతో మీతోపాటు ఇతరులు కూడా ఒమిక్రాన్ బారినపడకుండా సురక్షితంగా ఉండవచ్చని అన్నారు. తద్వారా ఆరోగ్య వ్యవస్థలపై మరింత ఒత్తిడి పడకుండా నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు.
"The Omicron variant has been detected around the world. We are seeing a very sharp increase in case numbers with almost 10 million cases reported in the last 7 days." –@mvankerkhove explains why Omicron is transmitting so efficiently and how to contain the spread of #COVID19. pic.twitter.com/IIjb4rBoxX
— World Health Organization (WHO) (@WHO) January 8, 2022