మంగళవారం 31 మార్చి 2020
International - Jan 19, 2020 , 02:33:47

అమెజాన్ బాస్ మీద బీజేపీకి కోపం దేనికి?

 అమెజాన్ బాస్ మీద బీజేపీకి కోపం దేనికి?

ఇటీవలికాలంలో ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయిన బహుళజాతి కంపెనీ ఏదీ అంటే అమెజాన్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంటింటా మారుమోగిపోతున్న పేరు అది. అమెజాన్‌లో ఇది తెప్పించుకున్నా, అమెజాన్‌లో అది తెప్పించుకున్నా అనే కబుర్లు ఎక్కడికి పోయినా వినపడుతుంటాయి. ఆ కంపెనీ బాస్ పేరు జెఫ్ బిజోస్. అపర కుబేరుడు. ఇటీవలే విడాకుల పుణ్యమా అని ఆస్తి సగానికి సగం తగ్గిపోయింది. అయినా సంపన్నుల జాబితాలో ఇప్పటికీ ఆయనది అగ్రస్థానమే. అలాంటి వ్యక్తి తన కంపెనీ ప్రమోషన్ కోసం ఇండియాకు వచ్చారు. భారతదేశం చలనశీలత, శక్తి, ప్రజాస్వామ్యం వెరసి ఈ శతాబ్దిని భారతదేశ శతాబ్దిగా నిలబెడుతాయన్న అంశంతో ఆయన ఓ పెద్ద కార్యక్రమం నిర్వహిస్తే బీజేపీ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు.


విదేశీ పెట్టుబడిదారులను కలుసుకునే అవకాశాలను ఏమాత్రం వదులుకోని ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. కేంద్ర పెద్దలెవరూ కూడా బిజోస్‌తో భుజాలు రాసుకోలేదు. దీనిపై చాలామంది కనుబొమలు ఎగరేశారు కూడా. మొత్తం మీద బిజోస్ రానూ వచ్చారు. వెళ్లనూ వెళ్లారు. పోతూపోతూ భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు, బోలెడు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు బిజోస్ ప్రకటిస్తే దానిని కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 'అబ్బో మహగొప్ప' అని వెటకారం చేశారు. తర్వాత సవరింపు ప్రకటన వెలువరించారనేది వేరే విషయం.

ఇంతకూ బీజేపీ వారికి బిజోస్ మీద కోపం ఎందుకూ అంటే ఓ సంగతి బయటికి వచ్చింది. బిజోస్ కు చాలా వ్యాపారాలున్నాయి. అందులో వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రిక కూడా ఒకటి. పలుకుబడి కలిగిన ఆ పత్రిక తరచుగా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా రాస్తుంది. కశ్మీర్ 370 రద్దు మొదలుకుని తాజాగా సీఏఏ వరకు మోదీ విధానాలను తూర్పారపడుతుంది. ఇది సహజంగానే బీజేపీకి కంటగింపుగా తయారైంది. ఆ పార్టీ విదేశీ వ్యవహారాల ప్రతినిధి డాక్టర్ విజయ్ చౌతాయీవాలే ట్విట్టర్ లో చేసిన విమర్శతో బీజేపీ కక్ష ఏమిటో వెలుగులోకి వచ్చింది. వార్తలు మంచిగా రాయాలని మీ వాషింగ్టన్ పోస్ట్ ఉద్యోగులకు చెప్పండి అంటూ ఆయన ట్విట్టర్‌లో బిజోస్‌కు సలహా ఇచ్చారు.

దీనికి సమాధానం బిజోస్ నుంచి కాకుండా వాషింగ్టన్ పోస్ట్ నుంచే వచ్చింది. మాది ఇండిపెండెంట్ జర్నలిజం.. మేం ఎలా వార్తలు రాయాలో బిజోస్ చెప్పనేచెప్పరు అంటూ ఆ పత్రిక ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఆ పత్రిక మీ పార్టీ ప్రభుత్వాన్ని విమర్సిస్తున్నదనే కారణంగా విదేశీ పెట్టుబడిదారులను దూరం పెడతారా? 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను తయారు చేసేది ఇలాగేనా? అని మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం సర్కారుపై అక్షింతలు వేశారు. మలేషియా ప్రధాని సీఏఏను విమర్శించారని ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతిని నిలిపివేయాలని వ్యాపారులపై కేంద్రం వత్తిడి తెచ్చిన సంగతు తెలిసిందే. 


logo
>>>>>>