న్యూఢిల్లీ: స్లోవేకియా(Slovakia) ప్రధాని రాబర్ట్ ఫికోపై హత్యాయత్నానికి పాల్పడిన 71 ఏళ్ల వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. ఆ అనుమానిత వ్యక్తిని ఓ రచయిత అని తేల్చారు. ఈ విషయాన్ని హోం మంత్రి మాటుల్ సుతాజ్ ఎస్టోక్ కన్ఫర్మ్ చేశారు. హండ్లోవా పట్టణంలో ప్రధాని ఫికోపై ఆ వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి ప్రధాని తప్పించుకున్నట్లు తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. పలు రౌండ్ల కాల్పుల తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాల్పులు జరిపిన అనుమానిత వ్యక్తిని దుహ(రెయిన్బో) లిటరీ క్లబ్ వ్యవస్థాపకుడిగా గుర్తించారు. అతని పేరు జురాజ్ సింటులా. ప్రతిపక్ష ప్రగతిశీల స్లోవేకియా పార్టీకి అతను మద్దతు ఇస్తున్నాడు. లివిసీ అనే పట్టణంలో అతను జీవిస్తున్నాడు. అతను మూడు కవితా సంకలనాలను రాసినట్లు తెలుస్తోంది. స్లోవేక్ రైటర్స్ సంఘంలో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. 2015లో ఆ సంఘంలో సభ్యుడిగా ఉన్నట్లు ఎఫ్బీ ద్వారా తెలుస్తోంది. అయితే తన తండ్రి ఏ ఉద్దేశంతో కాల్పులకు తెగించాడో అర్థం కావడం లేదని ఆ షూటర్ కు చెందిన కుమారుడు తెలిపాడు.
తన తండ్రి వద్ద లైసెన్సు తుపాకీ ఉన్నట్లు చెప్పాడు. ప్రపంచం అంతా హింసా, ఆయుధాలతో నిండి ఉన్నదని, ప్రజలు చాలా క్రేజీగా మారుతున్నారని ఆ షూటర్ 8 ఏళ్ల క్రితమే ఆన్లైన్లో ఓ వీడియోను పోస్టు చేశారు. లివిస్ పట్టణంలో హింసకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పాడు. ఆ ఉద్యమ సంఘాని ఫేస్బుక్ పేజీ ఉన్నది. సమాజంలో హింసను నియంత్రించడమే ఆ ఉద్యమం ఉద్దేశం.
అతి సమీపం నుంచి షూటర్ అయిదు సార్లు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల వల్ల ఫికో కడుపు, చేతికి బుల్లెట్లు దిగాయి. స్లోవేకియా పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఆర్టీవీఎస్ను రద్దు చేయాలని పార్లమెంట్ లో చర్చ ప్రారంభమైన రోజే షూటింగ్ ఘటన జరిగింది.