వాషింగ్టన్: మూడవ ప్రపంచ యుద్ధం చేపట్టాలని ఆసక్తి తమకు లేదని అమెరికా స్పష్టం చేసింది. దీనిపై వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి కామెంట్ చేశారు. బుధవారం అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే నో ఫ్లై జోన్ విధించాలని జెలెన్స్కీ అమెరికాను కోరారు. ఆ అభ్యర్థనపై అధ్యక్షుడు బైడెన్ ఏమైనా ఆలోచిస్తున్నారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సాకి సమాధానం ఇచ్చారు. నో ఫ్లై జోన్ విధించడం అంటే దాన్ని అమలు చేయడమే అని, అంటే రష్యా విమానాలను షూట్ చేయడమని, నాటో దళాలు కూడా రష్యా విమానాలను పేల్చాల్సి వస్తుందని, మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆరంభించడం తమకు ఇష్టంలేదని జెన్ తెలిపారు.
Psaki is asked if there is any scenario in which Biden would change his mind about a no-fly zone over Ukraine:
"We are not interested in getting into World War III." pic.twitter.com/ep03kkvvLc
— The Post Millennial (@TPostMillennial) March 16, 2022
ఒకవేళ నో ఫ్లై జోన్ విధిస్తే అప్పుడు రష్యాతో యుద్ధం మరింత విస్తృతంగా మారుతుందని వైట్‌హౌజ్ అభిప్రాయపడింది. జెలెన్స్కీ ఇచ్చిన ప్రసంగాన్ని బైడెన్ తన నివాసం నుంచి ప్రత్యక్షంగా చూశారని, ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం చాలా ఆవేశపూరితంగా, శక్తివంతంగా ఉందన్న అభిప్రాయం కలిగిందని, కానీ జాతీయ భద్రతా దృష్ట్యా.. తమ ప్రభుత్వం నో ఫ్లై జోన్ పై నిర్ణయం తీసుకోవడంలేదని ఆమె అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను 1941లో జరిగిన పెరల్ హార్బర్, 2001లో అమెరికాపై జరిగిన ఉగ్రవాద దాడితో జెలెన్స్కీ పోల్చిన విషయం తెలిసిందే.