శాన్ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 28: తన కంపెనీ డాటాను అపహరించిన కొందరు దోపిడీకి తెరతీసి భారీ మొత్తంలో సొమ్ముకు డిమాండ్ చేస్తున్నారని శాన్ఫ్రాన్సిస్కోలో భారతీయ సంతతికి చెందిన ఏఐ స్టార్టప్ గిగా సహ వ్యవస్థాపకుడు, సీఈవో వరుణ్ ఉమ్మడి ఆరోపించారు. కొంతమంది వ్యక్తుల సమూహం తన కంపెనీకి చెందిన రహస్య సమాచారాన్ని సేకరించి, దానిని బయట పెట్టకుండా ఉండాలంటే 3 మిలియన్ డాలర్లను క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని ఈ-మెయిల్ ద్వారా డిమాండ్ చేస్తున్నారని ఎక్స్‌లో ఆరోపించారు.
ఈ-మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేసిన ఆయన ఆ మొత్తం చెల్లించకపోతే డాటా అంతా బహిర్గతం చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. కాగా, గిగా పలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడిందని ఆ కంపెనీ మాజీ ఉద్యోగి జరేద్ స్టీలే ఆరోపించారు. అది తప్పుడు ఆదాయాన్ని చూపిందని, 500 ఫార్చూ న్ కంపెనీలకు లంచం ఇచ్చిందని, ఉద్యోగులను వేధించిందని, వారి తో రోజుకు 12 గంటలు పనిచేయించే వారని, ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను ఎగ్గొట్టిందని ఆయన ఆరోపించారు.