Dmitry Peskov : రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనకు ముందు.. భారత్-రష్యా (India-Russia) సంబంధాలపై పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ (Dmitry Peskov) కీలక ప్రకటన చేశారు. వాణిజ్యలోటు విషయంలో భారత్ ఆందోళనలు తమకు తెలుసన్నారు. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా ఉగ్రవాదంపై కలిపి పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇతర దేశాల ఒత్తిడి లేని వ్యాపార విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ తరుణంలో రష్యా నుంచి ఇలాంటి ప్రకటన వెలువడడం గమనార్హం. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్‌కు చమురు సరఫరా తగ్గకుండా చూసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పెస్కోవ్ తెలిపారు.
భౌగోళిక రాజకీయాలకు అతీతంగా పనిచేసే ఒక వాణిజ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలని రష్యా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రక్షణ సహకరాన్ని కూడా మరింత విస్తరిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా మధ్యవర్తిత్వం ‘చాలా ప్రభావవంతంగా’ ఉందని, వారి ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నామని అన్నారు.
పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 4, 5 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. ఇరు దేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలూ కుదిరే అవకాశం ఉంది. భారత్‌పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.