శాన్ఫ్రాన్సిస్కో, సెప్టెంబర్ 24: అగ్రరాజ్యం అమెరికాలో టెక్ ఉద్యోగుల వేతనాలు తగ్గిపోతున్నాయి. రికార్డుస్థాయి ద్రవ్యోల్బణం, మార్కెట్ ఒడిదొడుకులే ఇందుకు కారణం అని ‘హైర్డ్'(జాబ్ సెర్చ్ మార్కెట్‌ప్లేస్) నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాదితో పోల్చితే 2023లో వార్షిక వేతనం 1,61,000 డాలర్ల నుంచి 1,56,000 వరకు తగ్గినట్టు పేర్కొన్నది.
కార్పొరేట్ బడ్జెట్‌ను కట్టుదిట్టం చేయటం, కృత్రిమ మేథ (ఏఐ) సేవలు పెరగటం వల్ల జూనియర్ స్థాయి టెక్ ఉద్యోగుల జీతాల్లో క్షీణత ఏటా 5 శాతం వరకు ఉందని నివేదిక తెలిపింది. గత ఐదేండ్లలో అమెరికా స్థానిక టెక్ ఉద్యోగుల జీతాల్లో దాదాపు 9శాతం వరకు తగ్గుదల నమోదైంది. క్రితం ఏడాదితో పోల్చితే 2023 మధ్యనాటికి 1,41,000 డాలర్ల నుంచి 1,29,000 డాలర్లకు పడిపోయింది. ఆర్థిక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ బ్రిటన్‌లో టెక్ ఉద్యోగుల జీతాల్లో ఏటా 4శాతం పెరుగుదల కనిపించింది. 82 వేల పౌండ్ల నుంచి 86 వేల పౌండ్లకు పెరిగిందని నివేదిక తెలిపింది.