న్యూఢిల్లీ: వోయేజర్-1 స్పేస్‌క్రాఫ్ట్(Voyager 1 spacecraft)లో ఉన్న రేడియో ట్రాన్స్మిటర్ 47 ఏళ్ల తర్వాత రియాక్ట్ అయ్యింది. ఆ స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పుడు భూమికి సుమారు 1500 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నది. అక్టోబర్ 16వ తేదీన ఆ స్పేస్‌క్రాఫ్ట్‌కు పంపిన కమ్యూనికేషన్ సిగ్నల్ కు రిప్లై రాలేదు. దీంతో నాసా శాస్త్రవేత్తలు ఆ అంతరిక్షనౌకతో మళ్లీ కాంటాక్ట్ అయ్యారు. 1981లో ఉన్న టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిన రేడియో ట్రాన్స్మిటర్లు ఆ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉన్నాయి. కాలిఫోర్నియాలో ఉన్న జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ లోని శాస్త్రవేత్తలు.. అక్టోబర్ 24వ తేదీన మళ్లీ ఆ స్పేస్‌క్రాఫ్ట్‌తో కాంటాక్టులోకి వచ్చారు.
ట్రాన్స్మిటర్లలో లోపం తలెత్తడంతో అక్టోబర్ 16వ తేదీన కమ్యూనికేషన్ అంతరాయం ఏర్పడింది. భూమి నుంచి వొయేజర్ లేదా వొయేజర్ నుంచి భూమికి సిగ్నల్ అందాలంటే సుమారు 23 గంటల సమయం పడుతుంది. అయితే 16వ తేదీన పంపిన సిగ్నల్‌కు 18వ తేదీన రెస్పాన్స్ వచ్చింది. దీంతో అది ఆలస్యంగా స్పందించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వోయేజర్లో ఉన్న ప్రొటెక్షన్ సిస్టమ్ వల్ల రెండో ట్రాన్స్మిటర్ ఆన్ అయినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.
వొయేజర్1లో రెండు రేడియో ట్రాన్స్మిటర్లు ఉన్నాయి. ఎక్స్ బ్యాండ్ అనే ట్రాన్స్మిటర్ను మాత్రమే చాన్నాళ్లుగా వాడుతున్నారు. ఎస్ బ్యాండ్ అనే మరో ట్రాన్స్మిటర్.. 1981 నుంచి వాడలేదు. అయితే ఇప్పుడు ఆ ఎస్ బ్యాండ్ ట్రాన్స్మిటర్ ఆన్ అయినట్లు గుర్తించారు. వోయేజర్ 1 ప్రస్తుతం హీలియోస్పియర్ను దాటేసింది.