కీవ్, ఏప్రిల్ 22: ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌పై రష్యా సాగించిన క్రూరత్వ చర్యల తాలూకు ఆనవాళ్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బుచాలో బయటపడిన అకృత్యాలను తలదన్నే రీతిన మరియుపోల్‌లో పుతిన్ సేనలు మారణహోమానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. నగరంలోని వేల మంది ఉక్రెయిన్ పౌరులను హతమార్చిన పుతిన్ సేనలు.. ఆ నేరాలను దాచిపెట్టేందుకు మృతదేహాలను పాతిపెడుతున్నారంటూ ఉక్రెయిన్ అధికారులు చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు లభ్యమయ్యాయి.
మరియుపోల్‌కు సమీపంలోని మన్‌హుష్ గ్రామంలో 200కు పైగా సమాధులు తవ్విన విషయం మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది. మార్చి చివరి వారంలో మూడు రోజుల వ్యవధిలోనే సదరు ప్రాంతంలో ఈ సమాధులు తవ్వినట్టు తెలుస్తున్నది. మరియుపోల్ ఆక్రమణను ప్రతిఘటించిన పౌరులను హతమార్చిన రష్యా బలగాలు వివిధ ప్రాంతాల్లో తవ్విన సమాధుల్లో ఆ బాడీలను పూడ్చిపెట్టినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. యుద్ధ నేరాలను కప్పిపుచ్చుకోవడానికే రష్యా ఈ చర్యలకు పాల్పడినట్టు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 9 వేల మంది పౌరులను రష్యా సేనలు చంపేశాయని, ఆ మృతదేహాలను పూడ్చగలిగే సమాధులను గుర్తించినట్టు మరియుపోల్ సిటీ కౌన్సిల్ పేర్కొంది. ఉక్రెయిన్ అధికారుల లెక్కల ప్రకారం.. రష్యా దాడుల కారణంగా మరియుపోల్‌లో ఇప్పటివరకూ 20వేలకుపైగా పౌరులు మరణించి ఉండవచ్చని అంచనా. తూర్పు ప్రాంతంలోని డాన్‌బాస్‌పై రష్యా దాడులను తీవ్రం చేసింది. స్లోవ్యాన్స్క్పై రష్యా దాడులు పెరిగిపోవడంతో స్థానికులు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్లాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.
నాటోలో చేరితే ఉక్రెయిన్ గతే మీకూ పడుతుందంటూ రష్యా చేస్తున్న హెచ్చరికలను ఫిన్లాండ్ లెక్కచేయడం లేదు. త్వరలోనే నాటోలో చేరేందుకు తమ దేశం దరఖాస్తు చేయనున్నట్టు ఆ దేశ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఉక్రెయిన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, అక్కడ భయానక వాతావరణం నెలకొన్న దని ఐరాస మానవహక్కుల సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. వచ్చేవారంలోగా కీవ్‌లో తమ ఎంబసీని తిరిగి ప్రారంభిస్తామని బ్రిటన్ ప్రకటించింది.
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని ఓ బంకర్లోకి వెళ్లి తలదాచుకొన్న పుతిన్ ప్రేయసి అలీనా కబేవా రష్యా రాజధాని మాస్కోలో మళ్లీ కనిపించారు. శనివారం జరుగనున్న ఓ చారిటీ ఈవెంట్లో ఆమె పాల్గొననున్నట్టు సమాచారం.