లాటరీ కంపెనీనుంచి ఓ వ్యక్తికి ఫోన్ వచ్చింది. మీకు లాటరీ తగిలింది అని వాళ్లు చెప్పారు. రూ. 50వేల వరకు ఉండొచ్చు అనుకున్నాడు. దాన్ని క్లెయిమ్ చేసేందుకు లాటరీ కార్యాలయానికి వెళ్లాడు. తీరా తనకు వచ్చిన బహుమతి చూసి, అవాక్కయ్యాడు. అతడి నోటివెంట మాటరాలేదు.
యూఎస్‌లోని అన్నాడేల్కు చెందిన జోస్ ఫ్లోర్స్ వెలాస్క్వెజ్ అనే వ్యక్తి శీతలపానీయాలు కొనేందుకు ఓ షాప్‌కు వెళ్లాడు. అక్కడే వర్జీనియా కంపెనీ నుంచి ట్వంటీ ఎక్స్ మనీ స్క్రాచ్ ఆఫ్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. అకస్మాత్తుగా ఓ రోజు వెలాస్క్వెజ్కు వర్జీనియా లాటరీనుంచి ఫోన్ వచ్చింది. బహుమతి గెలుచుకున్నట్టు ఆ కంపెనీ వారు సమాచారమందించారు. దాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు వెలాస్క్వెజ్ వర్జీనియా లాటరీ కార్యాలయానికి వెళ్లాడు. రూ. 50వేల వరకు గెలుచుకున్నానేమో అనుకున్నాడు. కానీ, అతడు గెలుచుకున్నది రూ. ఏడు కోట్లని లాటరీ అధికారులు చెప్పగానే, ఆశ్చర్యపోయాడు. ట్యాక్సులు పోనూ రూ. ఆరు కోట్లపైగా మొత్తాన్ని వన్‌టైం సెటిల్మెంట్గా పొందేందుకు అంగీకరించాడు. ఆ డబ్బుతో కుటుంబాన్ని చూసుకుంటానని, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటానని వెలాస్క్వెజ్ ఆనందంగా తెలిపాడు.