కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో అనేక హృదయవిదారక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఉక్రెయిన్ను వీడి పోతున్న ప్రియురాలికి ఆ దేశ సైనికుడు పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఫాస్టివ్ చెక్పోస్ట్ వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. నగరాన్ని వీడుతున్న ప్రజలను చెక్పోస్ట్ వద్ద ఉక్రెయిన్ సైనికులు తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కారులో ప్రయాణిస్తున్న కొందరు తమ వాహనం దిగి చేతులను కారుపై పెట్టి వెనక్కి నిల్చొని ఉన్నారు. ఉక్రెయిన్ సైనికులు వారి కారును, పత్రాలను పరిశీలిస్తున్నారు.
కాగా, ఆ కారులో ప్రయాణిస్తున్న వారిలో తన ప్రియురాలు ఉన్నట్లు ఒక సైనికుడు గ్రహించాడు. తనిఖీ కోసం వెనక్కి నుల్చొన్న ఆమె వద్దకు వెళ్లి మోకాలిపై కూర్చొని తట్టాడు. ఒక చేతిలో ఉంగరం, మరో చేతిలో పుష్ఫగుచ్చంతో పెళ్లి ప్రపోజ్ చేసిన ప్రియుడ్ని చూసి ఆమె షాక్ అయ్యింది. సంతోషంతో ఆ సైనికుడ్ని హత్తుకుని ముద్దు పెట్టుకున్నది. ఆ వెంటనే అతడు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. అనంతరం వారిద్దరు కౌగిళ్లలో, ముద్దుల్లో మునిగిపోయారు. దీంతో అక్కడున్న మిగతా సైనికులు, ఇతరులు చప్పట్లతో ఆ జంటకు అభినందనలు తెలిపారు.
చెక్పోస్ట్ వద్ద ఉన్న కొందరు మీడియా సిబ్బంది, ఉక్రెయిన్ సైనికులు తమ మొబైల్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై స్పందించడంతోపాటు వీడియోను షేర్ చేశారు. ‘యుద్ధం కాదు… ప్రేమను పంచండి. యుద్ధ సమయంలో హృదయాన్ని కదిలించే దృశ్యం’ అని ఒకరు పేర్కొన్నారు. ఈ జంటకు అంతా మంచి జరుగాలంటూ చాలా మంది నెటిజన్లు ఆకాంక్షించారు.
Kinda hard to beat this proposal: pic.twitter.com/pwNc1sC8Zf
— kendis (@kendisgibson) March 7, 2022