విమానాలు ఎక్కే ప్రయాణికులను లోపలకు ఆహ్వానించడం, వారికి ఏమైనా అవసరం ఉంటే సహకారం అందించడం ఎయిర్‌హెస్టెస్ ఉద్యోగుల పని. ఇలాగే ఒక ఎయిర్‌హోస్టెస్.. తనకు ఎదురైన ప్యాసింజర్‌ను విమానంలోకి ఆహ్వానించింది. అతని చేతిలోని బోర్డింగ్ పాస్ తీసుకొని కౌగిలించుకుంది. ఇదంతా దుబాయ్‌కు వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఎందుకంటే ఆ విమానం ఎక్కిన ప్యాసింజర్.. సదరు ఎయిర్‌హోస్టెస్ కుమారుడే. బుడి బుడి అడుగులతో విమానంలోకి వచ్చిన ఈ బుడతడు.. తన చేతిలోని బోర్డింగ్ పాస్‌ను తల్లికి అందించాడు. ఆమె దాన్ని తీసుకొని చేతుల చాపగానే వెళ్లి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత వెనక్కు తిరిగి కెమెరా వైపు చేతులు ఊపుతూ లోపలకు వెళ్లాడు.
ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ.. ‘‘నా జీవితంలో విమానంలోకి ఆహ్వానించిన అతి పెద్ద వీఐపీ’’ అంటూ పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంత కన్నా క్యూట్ వీడియో మరొకటి కనిపించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోతోపాటు ఆ బుడతడు తన తల్లీతండ్రులతో కలిసి ఉన్న ఫొటోను కూడా నెట్టింట షేర్ చేశారు. ఇప్పుడు ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.